– మై హోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మాణం
– భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
– ముచ్చింతల్‌లో ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ-శంషాబాద్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, అందరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో మై హౌమ్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు రూ.2.50కోట్లతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించారు. ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన ఈ భవనాన్ని ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మై హౌమ్ సంస్థల గ్రూప్ డైరెక్టర్ జూపల్లి జగపతిరావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య అభివృద్ధికి తోడ్పాటు అందించడం మంచి పరిణామమన్నారు. పేద విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మై హౌమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి జగపతిరావు మాట్లాడుతూ.. ముచ్చింతల్ గ్రామంతో ఉన్న అనుబంధంతో విద్య అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో 14 గదుల పాఠశాల భవనం, ప్రహరీ నిర్మించి, ఫర్నిచర్, కంప్యూటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత చంద్రయ్య, ఉపసర్పంచ్ గండు రాజు, మండల విద్యాధికారి డి.రాంరెడ్డి, మాజీ సర్పంచులు బిర్ల పెంటయ్య, బద్దం రాజశేఖర్‌రెడ్డి, వార్డు సభ్యులు కారుకొండ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.