లబ్ధిదారులకు అదనంగా రూ. మూడు లక్షల అందించాలి 

 నవతెలంగాణ –  భీంగల్
టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులను గుర్తించి వారికి  ప్రొసీడింగ్ కాపీలను అందజేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సరికాదని  బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ  అధ్యక్షులు దొనకంటి నరసయ్య, మల్లెల లక్ష్మణ్ లు అన్నారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని సుమంగళి చౌరస్తా వద్ద  గృహలక్ష్మీ లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ జాగా ఉండి ఇండ్లు లేని  వారికి ఇండ్లు కట్టించాలని మాజీ సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని,  ఇందులో భాగంగానే అర్హులను గుర్తించి ప్రొసీడింగ్ కాపీలను కూడా అందజేశామని,  కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశం అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు మరో రూ.మూడు లక్షలను అదనంగా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.