– మార్కెట్ కార్యదర్శులతో లక్ష్మీబాయి సమీక్ష
నవతెంగాణ బ్యూరో – హైదరాబాద్
మిర్చిపంట ధరలు ఎందుకు తగ్గాయని వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు జి.లక్ష్మీబాయి అధికారులను ప్రశ్నించారు. మార్కెట్ కార్యదర్శులను అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో ఆమె వరంగల్, ఖమ్మం మార్కెట్ కమిటీ కార్యదర్శులతో సమీక్షించారు. మార్కెట్ యార్డుల్లో నిత్యం మైకుల ద్వారా ప్రచారం, కరపత్రాలు పంచడం, పత్రికా ప్రకటనలు, ఇతర మాద్యమాల ద్వారా అవగాహన కల్పించాలని వారికి సూచించారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్తిదారులతో, కొనుగోలుదారులతో, ఇతర మార్కెట్ వినియోగదారులతో నిత్యం సంప్రదింపులు జరిపి రైతులు గిట్టుబాటు ధర పొందేలా చొరవ చూపించాలని ఆదేశించారు. దగ్గరలో ఉన్న శీతల గిడ్డంగిలో తమ సరుకును నిల్వ చేసుకుని, ఆ సరుకుపై రూ.రెండు లక్షల వరకు మార్కెటింగ్ శాఖ అమలు చేస్తున్న రైతు బంధు ఫథకం ద్వారా సమీప వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు మార్కెటింగ్ సంచాలకులు పి.రవి కుమార్, సంయుక్త సంచాలకులు వి.శ్రీనివాస్, వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు అజ్మీరా రాజు తదితరులు పాల్గొన్నారు.