– గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది
– ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుద్యోగ యువతకు భవిష్యత్తు : అభినందన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ఈ నెలాఖరుకల్లా అందరికీ రైతు భరోసా: మంత్రి తుమ్మల
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”గతేడాది ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళను అనేక ఇబ్బందులు, అవమానాలకు గురిచేసింది. ఆ సమయంలో నేను బాధను దిగమింగి.. నా అనుచరులకు ధైర్యం చెప్పా.. బాధను వ్యక్తపరిస్తే నా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నా..” అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభ, కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
శపథం నెరవేర్చుకున్నా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరిని అసెంబ్లీ గేటు తాకనీయనన్న తన శపథం నెరవేర్చుకున్నానని.. అన్నం తినేటప్పుడు ఓ మెతుకు జారి పడినట్టు ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు అనేక బాధలకు ఓర్చారని తెలిపారు. ‘కర్కట ధమనికలు’ ఎవరో ప్రజలు తేల్చారన్నారు. ఖమ్మంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఆక్రమణలను వెలికి తీశామని చెప్పారు. ఈ సందర్భంగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానాన్ని లఘుచిత్రం రూపంలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ రూపకర్త రైట్ చాయిస్ అకాడమీ చైర్మెన్ మెండెం కిరణ్ కుమార్‌ను పొంగులేటితో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన నిరుద్యోగుల సదస్సు నుంచే బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను గళం వినిపించిన విషయాన్ని పొంగులేటి గుర్తు చేసుకున్నారు.
ఈ నెలాఖరుకల్లా అందరికీ రైతుభరోసా : మంత్రి తుమ్మల
ఈ నెలాఖరుకల్లా అందరికీ రైతు భరోసా పంట పెట్టుబడి లభిస్తుందని వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. చరిత్ర తిరగబడిందని, అందర్నీ పీడించిన ఆనాటి నాయకులు మీ శక్తి ముందు నిలువలేకపోయారన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గోదావరి జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు సొరంగం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. పాలేరు – ఖమ్మం ఒక్కటే అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, సాధు రమేష్ రెడ్డి, తుంబూరు దయాకర్ రెడ్డి, విజయా బాయి, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కోట రాంబాబు, చావ శివరామకృష్ణ, రామసహాయం నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.