కేసులకు భయపడం : కేటీఆర్‌

పరిపాలనపై దృష్టి సారించి.. పార్టీకి సమయమివ్వలేకపోయాం...నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వరంగల్‌ ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, తమ పార్టీకి పటిష్టమైన లీగల్‌ సెల్‌ ఉందన్నారు. బాధితులకు అది అండగా ఉంటుందని వివరించారు. ఒక్క ఎంపీపీపై కేసు నమోదు చేస్తే బీఆర్‌ఎస్‌కు చెందిన మిగతా ఎంపీపీలందరూ స్పందిం చాలని కోరారు. తప్పుడు కేసులపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
మళ్లీ పుంజుకుందాం
ఆరు గ్యారంటీల అమల్లో అనేక అనుమానాలు :ఎమ్మెల్యే కడియం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కంగిపోవాల్సిన అవసరం లేదనీ, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి పుంజుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ వరంగల్‌ ఎంపీ స్థానంపై నిర్వహించిన సమీక్షలో మొత్తం వెయ్యి మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. వారి నుంచి అనేక విలువైన సూచనలు వచ్చాయని అన్నారు. ఇప్పటి నుంచి జిల్లా పార్టీ కార్యాలయాలను పటిష్టంగా పని చేయించేందుకు సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో అనేక అనుమానాలున్నాయని వివరించారు. వాటిలో కోతలు తప్పవని తెలిపారు. కర్ణాటకలో అక్కడి సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్‌ రాయరెడ్డి గ్యారంటీల అమలు సాధ్యం కాదంటూ చెప్పారని గుర్తు చేశారు. అదే పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతం కానుం దని హెచ్చరించారు. అందువల్ల గ్యార ంటీల అమలుపై ప్రభుత్వంతో పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్ములా వన్‌ రేసులో నిధులు దుర్వినియోగం అయితే విచారణ జరిపించుకోవచ్చనీ, అంతే తప్ప మొత్తం రేస్‌నే రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కార్యకర్త కాలుపై నుంచి వెళ్లిన కెకె వాహనం
వరంగల్‌ ఎంపీ స్థానంపై సమీక్ష సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఒక చిన్న అపశృతి చోటు చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వాహనం అక్కడ ఉన్న ఒక కార్యకర్త కాలుపై నుంచి వెళ్లింది. ఓవర్‌ స్పీడే దీనికి కారణమని నేతలు చెప్పారు.