కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాన్ని ఒక్కసారి చూడండి…

Take a look at the structure of communist parties...– వాటికి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలుంటాయి
– 60 లక్షల సభ్యత్వమున్న మనకు అలాంటి కమిటీలేవి..?
–  కేసీఆర్‌ దిష్టిబొమ్మలు తగలేసిన వాళ్లు నేడు స్టేజీపై ఉన్నారు : వరంగల్‌ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతల ఆవేదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలించండి.. వాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలుంటాయి. 60 లక్షల సభ్యత్వముందని చెప్పుకుంటున్న మనకు అలాంటి కమిటీలు ఎందుకు ఉండటం లేదు..? ఈ అంశంపై ఎప్పుడైనా సమీక్షలు చేశారా…?’ అంటూ వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్ట్‌ పార్టీలు ప్రతీయేటా సభలు, సమావేశాలు నిర్వహించటం ద్వారా లోపాలు, లోటుపాట్లపై సమీక్షించుకుంటాయని వారు తెలిపారు. అలాంటి ఆత్మపరిశీలన లేకపోవటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ వాపోయారు. అందువల్ల ఇప్పటికైనా పార్టీ వైఖరి, అధిష్టానం పద్ధతి మారాలంటూ విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం వరంగల్‌ లోక్‌సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ భేటీకి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లా నేతలు మాట్లాడుతూ… పార్టీ అధిష్టానం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినట్టు సమాచారం. మొదటి నుంచి కేసీఆర్‌ వెంట నడిచిన వారికి పార్టీ అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎవరెవరితోనైతే పోరాడామో వారే ఇప్పుడు స్టేజీపై ఉన్నారంటూ టీడీపీ, కాంగ్రెస్‌ (కడియం, ఎర్రబెల్లి, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు) నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కేసీఆర్‌ దిష్టిబొమ్మలు తగలబెట్టిన వారు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ పోషించిన తరహాలోనే కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ప్రధాన పాత్రను పోషించిందని తెలిపారు. అయితే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకతీయ వర్శిటీ నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారిని పట్టించుకోలేదంటూ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్రంలో లేని బీజేపీని పెద్ద పెద్దగా విమర్శించి, ప్రధాన పోటీదారుడైన కాంగ్రెస్‌పై అసలు ఫోకస్సే పెట్టలేదంటూ మరికొందరు వాదించినట్టు తెలిసింది. ఆ పార్టీని తక్కువగా అంచనా వేయటం వల్లే ఓడిపోయామనే విషయాన్ని వారు కేటీఆర్‌, ఇతర నేతల దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు కిందిస్థాయిలోని వాస్తవాలను అధిష్టానం దృష్టికి తీసుకుపోయేందుకు ఎమ్మెల్యేలు ధైర్యం చేయలేదని తెలిపారు. ఇలాంటి అంశాలన్నింటినీ సమీక్షించుకోకపోతే పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవంటూ వారు హెచ్చరించినట్టు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నేత తెలిపారు.