– సంపూర్ణ థియేటర్ వాటాదారుడు సామ జంగారెడ్డి
నవతెలంగాణ-వనస్థలిపురం
రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిని అరెస్టు చేయాలని సంపూర్ణ థియేటర్ వాటాదారుడు సామ జంగారెడ్డి డిమాండ్ చేశారు. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్లో తాను 15 శాతం వాటా దారుణ్ణి అని, పది ఏళ్లుగా లావాదేవీలు చూపించకపోవడంతో ఏషియన్ ఆఫీస్‌కు వెళితే అసలు నిజాలు బయట పడ్డాయని వాటాదారుడు సామ జంగారెడ్డి తెలిపారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 120బి, 406, 420, 427, 504, 506 ఐపిసి,156(3) సెక్షన్ కింద కేసు నమోదు అయిందని వివరించారు. తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని విలేకరులకు అందజేశారు. పోలీసులు ఈ నెల 4న కేసు నమోదు చేసినా.. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏషియన్ మేనేజింగ్ పార్ట్నర్ సామ రంగారెడ్డి సంపూర్ణ థియేటర్ పై వారానికి రెండు లక్షలా ఇరవై వేలు వస్తున్నా..వాటాదారులకు మాత్రం లక్ష ఇరవై వేలు వస్తున్నాయని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఈ థియేటర్లో 960 సీట్లు ఉండగా ఎంసీఎల్ లెక్కలు చూపకుండా, పార్కింగ్, క్యాంటీన్ డబ్బుల్లో సగ భాగం లెక్కల్లో చూపకుండా మోసానికి పాల్పడుతున్నాడని థియేటర్ వాటాదారుడు సామ జంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్‌కు చెందిన రహదారిని ఆక్రమించి అగర్వాల్ స్వీట్ హౌమ్‌కు అద్దెకు ఇచ్చి అడ్వాన్స్‌గా ఐదు లక్షలు, ప్రతి నెల 40 వేలు కిరాయి వసూలు చేస్తూ లెక్కలు చూపించడం లేదని మండిపడ్డారు. సామ రంగారెడ్డి చేస్తున్న మోసాలపై గతంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు సివిల్ కేసుగా పరిగణించి కోర్టుని ఆశ్రయించాలని చెప్పడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 4వ తేదీన సామ రంగారెడ్డిపై పలు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. కానీ ఇంతవరకూ సామ రంగారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.