– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్
వర్షా కాలంలో వరద నీటితో ఇబ్బందులు పడుతున్న వివిధ కాలనీల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎస్‌ఎన్‌డీపీ నిధులతో వరద కాల్వల నిర్మాణ పనులను చేపట్టినట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంతమోని కుంట నుండి నబిల్ కాలనీ, డ్రీమ్ సిటీ, గ్రీన్ సిటీ పరిసర ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటికే రూ.12వందల కోట్ల నిధులతో వరద కాల్వల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. రెండేళ్ల కిందట భారీ వర్షాలకారణంగా వరద నీరు, డ్రైనేజీల నీరు వివిధ కాలనీలలో ప్రవహించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనేే విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేయటం జరిగిందని గుర్తుచేశారు. ఆ నిధులతో నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న నాదర్ గుల్ గ్రామంలోని సున్నం చెరువు నుండి వరద నీటి నాలా నిర్మాణ పనుల కోసం రూ. 60 కోట్ల నిధులకు ప్రతి పాదనలు చేసినట్లు తెలిపారు. అందులో రూ.8 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా బిన్ సాది, కమిషనర్ వసంత, డీఈఈ వెంకన్న, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈలు అశోక్ రెడ్డి, జ్యోతి, అధికారులు బాలాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంగవీటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గుండోజి రఘునందన్ చారి, అరవింద్ గౌడ్, సురేష్ గౌడ్, అశ్విన్ రెడ్డి సుమంత్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖలీల్ పాషా, జల్‌పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శంషోద్దిన్, కో ఆప్షన్ సభ్యులు బడంగ్‌పేట మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, జల్‌పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎగ్బాల్ బిన్ ఖలీఫా, సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.