లాక్కున్న పోడు భూములను తిరిగివ్వాలి

– సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడి చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి
– రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలి: సీపీఐ(ఎం) జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి ఎర్రా శ్రీకాంత్‌
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా మాణిక్యారం ఎర్రబోడు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న పోడు భూములను తిరిగి వారికి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి ఎర్రా శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడి చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రంతో కలిసి శ్రీకాంత్‌ మాట్లాడారు. కారేపల్లి మండలం మాణిక్యారం, ఎర్రబోడు గ్రామాల గిరిజన పేద రైతులు ఏడు దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. కానీ, 2020లో హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు దాదాపు 200 ఎకరాలను బలవంతంగా తీసుకున్నారన్నారు. ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు చూపుతామని మభ్యపెట్టి.. తిరిగి గిరిజన పోడు రైతులపైనే అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలోనే స్థానిక మండల అధికారులు, తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌ అధికారులు అటవీశాఖ అధికారులతో మూడు దఫాలుగా చర్చలు జరిపారన్నారు. ఆ భూములు గతం నుంచి పోడు రైతుల సాగులోనే ఉన్నాయని కలెక్టర్‌కు రిపోర్టు పంపించారని గుర్తు చేశారు. ”మా భూములు మాకే ఇవ్వాలని.. భూమిపై హక్కులు కల్పించాలని” అనేకసార్లు ఆందోళనలు, పోరాటాలు చేశారని చెప్పారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఆర్సీ గ్రామసభలో పోడు రైతుల దరఖాస్తుల స్వీకరించి ఆమోదించిందని తెలిపారు. భూములను సాగు చేసుకుంటే.. అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. సీపీఐ(ఎం) బృందం కారేపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిని కలిసి కేసులు లేకుండా చూడాలని కోరామని, అరెస్టులు అవసరం లేదని అధికారి చెప్పినా ఎఫ్‌ఆర్‌ఓ అతి ఉత్సాహం ప్రదర్శించారన్నారు. నాయకులను ఫారెస్ట్‌ కార్యాలయంలో ఉంచి.. తన సిబ్బందితో వెళ్లి సీపీఐ(ఎం) కారేపల్లి కార్యాలయంపై దాడి చేయడం సరికాదన్నారు. అలాంటి అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి మాణిక్యారం, ఎర్రబోడు భూ సమస్యను పరిష్కరించి పోడు రైతులకు న్యాయం చేయాలని కోరారు. మళ్లీ పోడు రైతుల జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్‌, చింతలచెరువు కోటేశ్వరరావు, వై.విక్రమ్‌ తదితరులు ఉన్నారు.