అక్రమ వరి సాగును అరికట్టాలి 

– కోట కాలువ ఆయకట్టు రైతులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో లక్నవరం చెరువు క్రింద రంగాపురం కాలువ ప్రాంతంలో సాగు చేస్తున్న వరి అక్రమ సాగును అరికట్టాలని కోట కాలువ ఆయకట్టు రైతులు కోరారుశుక్రవారం కోట కాలువ ఆయకట్టు రైతులు మీడియాతో మాట్లాడి తమ సమస్యలను తెలిపారు. ఈ సంవత్సరం రొటేషన్ పద్ధతిలో భాగంగా కోట కాలువ ఆయకట్టును ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించడం జరిగిందని అన్నారు. కానీ రంగాపురం పొడవునా రైతులు అక్రమంగా వరి సాగు చేస్తున్నారని దీనివల్ల కోట కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. లక్నవరం చెరువులో నీటి లెవెల్ తక్కువగా ఉందని ఈసారి మేడారం జాతర ఉన్నందున జాతరకు నీటిని విడుదల చేయవలసి ఉంటుందని ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా సాగు చేస్తే రోటేషన్ లో సాగు చేసే రైతులకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు తలెత్తుతాయని తెలిపారు. ప్రస్తుతం వరి అక్రమంగా సాగు చేస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి అక్రమ సాగును నివారించాలని కోరారు. అంతేకాక రంగాపురం కోటకాల్లోలకు 39 లక్షల రూపాయల నిధులు మంజూరైన సంబంధిత గుత్తేదారు ఇప్పటివరకు పనులను ప్రారంభించకుండా ఆలస్యం చేస్తున్నారని అధికారుల అండదండలతోనే గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని విడుదల చేసిన కోటకాల్వకు వచ్చే పరిస్థితులు లేవని బైపరుగేషను ప్రాంతంలో కాలువ పూర్తిగా ధ్వంసమై ఉన్నందున సంబంధిత గుత్తేదారు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులైన చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. జనవరి 18 నీటిని విడుదల చేస్తామన్న నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటివరకు అందుకు అవసరమైన చర్యలను చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏంటని రైతులు ప్రశ్నించారు. అధికారులు నిద్ర మత్తు వదిలి విధి నిర్వహణలో భాగంగా కాలువలను పర్యవేక్షిస్తూ సకాలంలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని లేనట్లయితే ఆందోళన చేస్తామని అన్నారు.