ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం ప్రజాశ్రేయస్సుకై పరితపిస్తూ ఎందరో పాత్రికేయులు నిస్వార్థ సేవలందిస్తున్నారు. వారి నిజ జీవితంలో ఆర్థిక, సమస్యలతో, ఎన్నో ఒడిదుడుకుల నడుమ జీవిస్తూ, అతి కష్టతరంగా వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తూ నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెగేసి కొట్లాడిన వర్గాల్లో జర్నలిస్టులు కూడా ముందు వరుసలో ఉన్నా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించి, రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం జర్నలి స్టులను ఊరించుడే తప్ప చేసిందేమి లేదు. అన్ని వర్గాల అసంతృప్తి కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘కారు’ బోల్తాపడి పాలన ‘హస్త’గతమైంది. అయితే జర్నలిస్టుల సమస్య అంతటితో తీరిపోయిందనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయా అనే సందేహం లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పథకంతో అందిస్తున్న ఆరు గ్యారెంటీల్లో జర్నలిస్టులకు ప్ర త్యేక కోటాను కేటాయించాలి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల జాబితాను సేక రించి, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం, ఆయా కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు, ప్రతి నెలా గౌరవ వేతనం, జర్నలి స్టుల పిల్లలకు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య, సబ్సిడీ వాహనాలు, బ్యాంకులు, వివిధ కార్పోరేషన్‌లలో ప్రభుత్వ చొరవతో రుణాలు, హెల్త్ కార్డులను పకడ్బందీగా అమలు చేయాలి. బస్సు, రైళ్ల పాసులను మంజూరీ చేస్తూ, వయస్సు పైబడిన సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ వంటి సౌకర్యాలు కల్పించాలి. కొత్త ప్రభుత్వంలోనైనా నిత్యం ప్రజల కోసం పరితపించే జర్నలిస్టులకు కాపాడుకోవాలి.
– ఈదునూరి మహేష్, 9949134467