రెండేండ్లలో నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి

–  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ సచివాలయంలో ఆ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష ఎకరాలకు సాగునీరందించే ఉదయసముద్రం బ్రహ్మణవెల్లంల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కెనాల్స్‌తో పాటు, పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఈ కాలువలను పూర్తిచేసినప్పటికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహణ కూడా చేయక పోవడంతో పూడిక పెరిగిందని అన్నారు. వీటి మరమ్మత్తులను ఏడాదిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద మొదటిదశలో 50 వేల ఎకరాలకు, రెండో దశలో మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. భూసేకరణకు రెండు విడతలుగా రూ.200 కోట్లు విడుదల చేస్తామనీ, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాలు శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్‌ఎల్‌బీసీని సైతం నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జ, ఈఎన్‌సీ మురళీధర్‌, సీఈ అజరు కుమార్‌, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.