జేఏసీపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు

నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు గ్రాంటీన్‌ ఏయిడ్‌ జీతాలకు ఓ దిన పత్రికలో ‘కొత్త పేర్లు డబ్బులు వసూళ్లు’ అనే వార్తను తెలంగాణ దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయ మై శుక్రవారం బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ కమిషనరేట్‌ ముందు ఆందోళన నిర్వహించి అనంతరం తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో జేఏసీ బృందం ఫిర్యాదు చేశారు. జేఏసీ కన్వీనర్‌ పరశురామ్‌ రవీంద్రచార్యులు, అర్చక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాండూరి కృష్ణమాచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అగ్నిహౌత్రం చంద్రశేఖర శర్మలు మాట్లాడారు. కొందరు కావాలనే తమ సంఘాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలువనున్నట్లు జేఏసీ ప్రతి నిధులు తెలిపారు. ఇప్పటికైనా తమపై దృష్ప్రచారం మాను కోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు బండారి జగపతి, శ్రీకాంత్‌ గౌడ్‌, సురేష్‌, తారక రాముడు, యాదగిరి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.