– పూర్తి నివేదిక ఇవ్వండి : ఇంథనశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
– బిల్లులు ఇవ్వలేదు…అందుకే జాప్యం :బీహెచ్ఈఎల్ సీఎమ్‌డీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం ఆలస్యానికి కారణాలు ఏంటని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంథనశాఖ అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. అయితే వీటి నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడానికి గల కారణాలు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి ఇంథన శాఖ అధికారుల్ని అడిగారు. ముఖ్యంగా కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా, నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం టీఎస్జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, దీనిపై ఇరుపక్షాల మధ్య జరిగిన సంప్రదింపుల వివరాలు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్ ఆర్డర్ జారీ చేశారనీ, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికే పనులన్నీ పూర్తి కావల్సి ఉంటే, ఇప్పటికీ ఎందుకు పూర్తికాలేదని అడిగారు. అయితే దీనిపై బీహెచ్ఈఎల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్ తజీందర్ గుప్తా వివరణ ఇచ్చారు. సకాలంలో తమకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మొత్తం రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు రూ. 20,444 కోట్లు విలువ చేసే పనులు అప్పగించారనీ, మిగిలిన పనులు టీఎస్జెన్కో, ఇతర సంస్థలు చేపట్టాయని వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేస్తే, రూ.14,400 కోట్లు చెల్లించారనీ, ఇంకా రూ.1,167 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం తమకు విడతల వారీగా చెల్లింపులు చేయలేదనీ, 2023 మార్చి ఒక్క నెలలోనే 91శాతం పేమెంట్ చేశారని వివరించారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో, తాము సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేకపోయామనీ, ఫలితంగా పనులు సకాలంలో పూర్తికాలేదని వివరణ ఇచ్చారు. పర్యావరణ అనుమతులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తెస్తే, ఇదే ఏడాది సెప్టెంబర్ వరకు రెండు యూనిట్లు, డిసెంబర్ నాటికి రెండు యూనిట్లు, 2025 మే నెలాఖరుకు మిగిలిన ఒక యూనిట్ పనులు పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.