– ఎమ్మెల్యేలే పార్టీ కొంప ముంచారు…
– భువనగిరి ఎంపీ స్థానంపై సమీక్షలో బీఆర్ఎస్ నేతల ఆక్రోశం
– లోక్‌సభ సీటు కోసం పలువురి ప్రయత్నాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘దేశంలో వివిధ రంగాల్లో రాణించిన వారందరూ ఒక్కో వేదిక ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆ రంగంలో తమకు ఎదురు లేకుండా ఎదిగారు. కానీ మీరు అసలు మాకు అలాంటి వేదికలను ఇస్తే గదా..?’ అంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీకి తీరని నష్టం చేకూర్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భువనగిరి ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు, కార్యకర్తలు అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం సరిగా లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. దళిత బంధు లాంటి పథకాలు కొందరికే లబ్ది చేకూర్చటంతో మిగతా వారు అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారని నేతలు చెప్పారు. కార్యకర్తల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే పథకాలు చేరటంతో పార్టీ క్యాడర్‌కు, ఓటర్లకు లింకు తెగిందని అభిప్రాయపడ్డారు. నాయకులు లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ… పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయామంటూ ఆయన చెప్పినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీనికి తానే పూర్తి బాధ్యత వహిస్తానంటూ కేటీఆర్ పేర్కొన్నట్టు ఓ సీనియర్ నేత తెలిపారు.
మరోవైపు భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు తహతహలాడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్, క్యామ మల్లేశ్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. టిక్కెట్ దక్కించుకునేందుకు వీరు ఎవరికి వారుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.