నోబెల్‌ కవిత్వం

తెలుగు కవులకు, రచయితలకు మొత్తంగా తెలుగు సాహిత్యానికి నోబెల్‌ బహుమతి గ్రహీతల గూర్చి వివరంగా రాసి గొప్ప సాహిత్యోపకారం చేశారు ముకుంద రామారావు. ప్రపంచంలో వివిధ దేశాల్లోని సాహిత్య వాతావరణాన్ని చేతివేళ్లమీద చూపిస్తూ మన సాహిత్యాలోచనలు పెంచుతూ నోబెల్‌ పురస్కార ఔన్నత్యాన్ని కళ్ళెదుటనుంచాడు ముకుంద రామారావు.
1901 నుండి 2011 వరకు 37 మంది నోబెల్‌ పురస్కార గ్రహీతల జీవితం, కవిత్వ విశేషాలు మనం ఇందులో చదవగలం. 1901లో సాహిత్యంలో తొలి నోబెల్‌ పురస్కారం పొందింది ఫ్రాన్సు దేశానికి చెందిన విఫల ప్రేమలోంచి ప్రభవించిన నోబెల్‌ కవి సల్లీ పుథోమే. కాగా 2011లో నోబెల్‌ బహుమతి పొందినది. టామస్‌ ట్రాంస్ట్రాహ్మర్‌ స్వీడన్‌ దేశానికి చెందిన కవి. అతని కవిత్వం 60 భాషల్లోకి అనువాదమైనది.
తరుచుగా మనం ప్రేమించే చేయి గుండెను తాకుతుందో లేదో, గాయ పరుస్తుంది.
గుండె దానికదే పగులుతుంది.
దాన్ని ప్రేమించే పుష్పం నశిస్తుంది ‘బ్రోకెన్‌ వేజ్‌’ ఆధారంగా అనువదించబడ్డ కవిత.
ఎంత గాఢంగా కవిత్వీకరిస్తాడో ఆశ్చర్యమనిపిస్తుంది. ‘మనం ప్రేమించే చేయి… గుండెను గాయపరుస్తుంది’ అంటూ చెప్పే పంక్తుల్లో ప్రేమించాక గాయపర్చడమేమిటని మనందరికీ అనుమానమే కలుగుతుంది. చెప్పకనే చెప్పినట్లు ఆ ప్రేమవిఫలమైందని కవితాత్మకంగా చెప్పడమన్నమాట. ఇంకా గుండెపగులుతుందని అంటూ ప్రేమించే పుష్పం కూడా నశిస్తుందని చెప్పడంలో కవియొక్క లోతైన ఆలోచన మనకు కనబడ్తుంది.
‘పిల్లనగ్రోవి ఒప్పుకుంటుంది : గొప్పతనాన్ని నేను తీసుకోలేను
నన్ను పలికించేది శ్వాస ఒక్కటేనని
శ్వాస తెలుపుతుంది : నేను శూన్యాన్ని, కేవలం గాలినని
బొత్తిగా ఎవరికీ తెలీదు నిజమైన ఆటగాడు ఎవరో
ఇది బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రఖ్యాతకవి, విద్యావేత్త, తాత్వికుడు అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవిత. 2013 లో రవీంద్రుని ‘గీతాంజలి’కి నోబెల్‌ బహుమతి వచ్చింది. గీతాంజలికి ఇప్పటికి 30కిపైగా అనువాదాలు వచ్చాయంటారు. మనదేశమే గాక ఆసియా ఖండంలో మొదటి నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌,
మనదేశంలో ఠాగూరుకున్న పేరు, ప్రతిష్ఠలు, ‘విశ్వగురు’ బిరుదుతో అతనిపట్ల వున్న అపార గౌరవ ప్రతిపత్తులు ఈ పుస్తకంలో ముకుందరామారావు స్పశిస్తారు.
1971లో నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకున్న వ్యక్తి పాబ్లో నెరుడా. చిలీ దేశపు గొప్పకవి, అటు పీడిత తాడితుల కోసం జీవితాంతం తపించిన రాజనీతిజ్ఞుడుగా, ఇటు ప్రేమ కవిత్వం నుండి ప్రజాసాహిత్యం దశకు పయనించి నోబెల్‌ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేకత నిలుపుకున్నవాడు పాబ్లో నెరుడా.
ఇప్పటివరకు 2022) నోబెల్‌ సాహిత్య పురస్కారం పొందిన 119 మందిలో 17 మంది మహిళలు, 102 మంది పురుషులు.
సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం పొందిన మహిళ సెల్మా ఒటిల్యా లూవిసా లెజరాఫ్‌, 1858లో జన్మించిన ఈమె 1940లో మరణించింది. ఆమె రచనల్లో దాగివున్న ఆదర్శవాదం, విస్తృత కల్పనా చాతుర్యం, ఆధ్యాత్మిక చింతన కల్గించే అంశాలను ఆధారంగా చేసుకొని ఈ బహుమతిని ఇస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
‘ప్రతీ ప్రపంచ నైరూప్య చిత్రం, తుఫాను నమూనాలా అసంభవం. మానవత్వంలో ఉన్నందుకు నువు సిగ్గుపడాల్సింది లేదు, గర్వపడు. నీలోపల సొరంగం తరువాత సొరంగం అనంతంగా తెరుచుకుంటుంది. జరగాల్సిన విధంగానే, నువ్వు ఎప్పటికీ ముగిసిపోవు’ అనే ఈ మాటలు అరవై భాషల్లోకి అనువాదమైన కవి, స్వీడన్‌ దేశస్థుడైన టామస్‌ ట్రాంస్ట్రాహ్మర్‌, 2011 నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీతవి.
అత్యుత్తమ, అత్యున్నత విలువలతో ప్రపంచ సాహితీ అగ్రపీఠాన నిలిచిన కొందరి పరిచయాలతో మనల్ని ప్రపంచ సాహితీ సీమలో నడిపిస్తున్న ముకుంద రామారావు గారికి మనం కృతజ్ఞతలు తెల్పుతూ ఈ నోబె(బు)ల్‌ సాహిత్యాన్ని మనసారా చదువుదాం.