ఆమె గెలిచింది

ఆమె గెలిచిందికోర్టులు ఇచ్చే ఇలాంటి తీర్పులు వ్యవస్థపై మనిషికి నమ్మకాన్ని ఇస్తాయి. న్యాయం కోసం గుండె పగిలేలా ఏడ్చే అభాగ్యులకు ధైర్యానిస్తాయి. ‘చట్టం మాకు చుట్టం’ అని విర్రవీగే వారి అహాన్ని నిలువునా తగలబెడతాయి. ఎటూ చూసినా స్వార్థం నిండిన ఈ సమాజంలో సామాన్యులూ బతకగలరు అనే భరోసాని ఇస్తాయి. అలాంటిదే బిల్కిస్‌ బానో కేసులో ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.
ఏ పోరాటం ఫలించాలన్నా పట్టుదల, ఓపిక మెండుగా వుండాలి. ఈ వ్యవస్థలో అలుపెరుగక శ్రమించాల్సిందే. అందునా పోరాడేది మహిళ అయితే మరికాస్త ఎక్కువగానే శ్రమించాలి. పట్టువదలకుండా చేసే పోరాటమే సత్ఫలితాలను ఇస్తుంది. దీన్ని బిల్కిస్‌ బానో నిరూపించింది. న్యాయం కోసం ఇన్ని రోజులు రాజీ లేకుండా ఆమె చేసిన పోరాటం విజయవంతమయింది. ఆమె కన్నీటి వ్యధ అత్యున్నత న్యాయ స్థానాన్ని కదిలించి వేసింది. కోర్టులు ఇచ్చే ఇలాంటి తీర్పులు వ్యవస్థపై మనిషికి నమ్మకాన్ని ఇస్తాయి. న్యాయం కోసం గుండె పగిలేలా ఏడ్చే అభాగ్యులకు ధైర్యానిస్తాయి. ‘చట్టం మాకు చుట్టం’ అని విర్రవీగే వారి అహాన్ని నిలువునా తగలబెడతాయి. ఎటూ చూసినా స్వార్థం నిండిన ఈ సమాజంలో సామాన్యులూ బతకగలరు అనే భరోసాని ఇస్తాయి. అలాంటిదే బిల్కిస్‌ బానో కేసులో ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.
2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లలో మతోన్మాదులు చేసిన క్రూరమైన గాయానికి ఓ సజీవ సాక్షం బిల్కిస్‌. మూడేండ్ల ఆమె బిడ్డ తలను తన కండ్ల ముందే రాయికేసి కొట్టి చంపారు. ఆ దారుణాన్ని చూసి ఆ తల్లి గుండె ఎంతగా తల్లడిందో..? తన వారందరినీ కత్తులతో నరికి చంపారు. ఐదు నెలల గర్భిణి అని చూడకుండా ఆమెపై సమూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. తన జీవితంలో ఇన్ని ఘోరాలు జరిగినా ఏ మాత్రం కుంగిపోలేదు. తన్నుకొస్తున్న దు:ఖాన్ని పంటి బిగువున అదిమి పట్టి న్యాయం కోసం పోరాడింది. ఫలితంగా ఆ దుర్మార్గులకు యవజ్జీవకారాగార శిక్ష పడింది. ఇక తాను ధైర్యంగా బతకొచ్చని ఊపిరి పీల్చుకుంది. మరిచిపోలేని ఆ గాయాలకు లేపనం పూసుకుంటూ సమాజంతో మమేకమయ్యేందుకు సిద్దపడింది. సరిగ్గా అప్పుడే ఆ నేరస్తులను విడుదల చేస్తున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.
ఆమె కాలి కింది భూమి కంపించి పోయింది. వారు విడుదలైతే తన బతుకేంటని కన్నీరు పెట్టుకుంది. కానీ చేతులు ముడుచుకుని మాత్రం కూర్చోలేదు. మళ్ళీ తన పోరాటాన్ని మొదలుపెట్టింది. తన జీవితాన్ని సర్వనాశనం చేసి, తన వాళ్ళందరినీ దూరం చేసిన ఆ నీచులను తిరిగి జైలుకు పంపని అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాళ్ళు బయట ఉంటే తన ప్రాణానికే ప్రమాదమని విన్న వించుకుంది. ఏడాదిన్నరగా పోరాడుతూనే ఉంది. చివరకు సుప్రీం ఇలాంటి నీచులు బయట ఉండటానికి వీల్లేదని తీర్పు ఇచ్చింది. అంతే కాదు అంతటి దుర్మార్గులను విడుదల చేసి గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని మతోన్మాదుల చంప ఛెళ్లు మనిపించింది.
‘ఇప్పుడు నేను స్వతంత్రురాలనే భావన వచ్చింది. ఏడాదిన్నర తర్వాత మళ్ళీ కాస్త సంతోషంగా ఉండగలుగుతున్నాను. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే దీనికి కారణం. ఈ వ్యవస్థపై ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది’ అని ఆమె అన్నదంటే ఇన్ని రోజులు ఎంతటి మనో వేధన అనుభవించిందో..!
ఆమె సాధించిన విజయంపై ‘బిల్కిస్‌ జీ, ఇది మన మహిళలందరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకు ధైర్యం వచ్చింది’ అంటూ ఏడాదిగా తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కాపాడమంటూ న్యాయం కోసం నడివీధుల్లోకి వచ్చి పోరాడుతున్న రెజ్లర్‌ నాయకురాలు ఫోగట్‌ స్పందించారు. నిజమే కదా..! ఇప్పుడు ఆమె రెజ్లర్‌తో పాటు మరెందరికో స్ఫూర్తి. వ్యవస్థలోని అవస్థలు భరించలేక న్యాయం ఇక దక్కదేమో అని ఆవేదన చెందే ఎందరిలోనే చైతన్యం నింపిన ఉక్కు మహిళ. అలుపెరుగని ధిశాలి.