– మేఘాలయపై ఇన్నింగ్స్ విజయం
షిల్లాంగ్ (మేఘాలయ) : రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో హైదరాబాద్‌కు ఎదురులేదు. మేఘాలయపై ఇన్నింగ్స్ 81 పరుగులతో గెలుపొంది.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయం నమోదు చేసిన హైదరాబాద్.. ప్లేట్ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలగా.. రెండో ఇన్నింగ్స్‌లో 154 పరుగులకు ఆలౌటైంది. సచ్‌దేవ సింగ్ (53), కిషన్ (43) పోరాడినా మేఘాలయ ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోలేదు. 36.1 ఓవర్లలో 154 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో తనరు త్యాగరాజన్ (3/45), చామ మిలింద్ (2/23), రవితేజ (2/22) రాణించారు. అంతకముందు, రోహిత్ రాయు డు (124 నాటౌట్, 226 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహాని (52), చామ మిలింద్ (50 నాటౌట్, 38 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగటంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 346/7 పరుగులకు డిక్లరేషన్ ప్రకటించింది. రోహిత్ రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడో మ్యాచ్‌లో జనవరి 19 నుంచి సిక్కింతో హైదరాబాద్ తలపడనుంది.