పార్లమెంట్‌ ఎన్నికల్లోపు కుల గణన ప్రకటన చేయాలి

– రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జన గణనలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర బడ్జెట్‌లో బీసిల అభివృ ద్ధికి రూ. రెండు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 5, 6 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌ కాచిగూడలో బీసీ సంఘాల సమావేశంలో ఆర్‌ కష్ణయ్య పాల్గొని చలో ఢిల్లీ ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి ఉన్నా కూడా బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఆయన హెచ్చరించారు.