– కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ (ఢీ కొట్టి పారిపోవటం) ప్రమాదాల్లో మరణాలు, తీవ్ర గాయాలు జరిగితే పరిహారం మొత్తాన్ని ఏటా పెంచవచ్చో లేదో పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. మోటారు వాహనాల (ఎంవీ) చట్టం, 1988 ప్రకారం ఎవరైనా హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణిస్తే.. కేంద్రం సూచించిన విధంగా రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో పరిహారం చెల్లించాలనీ, తీవ్రమైన గాయమైతే అది రూ. 50వేలుగా చెల్లించాలన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. ఎంవీ యాక్ట్ కింద పరిహారం పథకం గురించి ఇలాంటి ప్రమాదాల బాధితుల కుటుంబ సభ్యులకు తెలియజేయాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2016లో 55,942 హిట్ అండ్ రన్ ప్రమాదాలు నమోదు కాగా.. 2022లో ఈ సంఖ్య 67,387కి పెరిగిందని నమోదైందని జస్టిస్ ఎఎస్ ఓకా, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.