చెక్‌పవర్‌ రద్దు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

– సర్పంచ్‌ కుమ్మరి జగన్నాథం
నవతెలంగాణ -పాపన్నపేట
చెక్‌ పవర్‌ రద్దు చేస్తు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రతి పక్షాలకు చెంపపెట్టులాంటిదని కొత్తపల్లి సర్పంచ్‌ కుమ్మరి జగన్నాథం ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ఈ నెల 6న (శనివారం) చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, తన ప్రతిష్టకు కలిగించే విధంగా వ్యవహ రించడమే కాకుండా తనను రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి చెక్‌ పవర్‌ రద్దు చేయించడాన్ని సవాలు చేస్తూ తాను హైకోర్టు న్యాయస్థాన్ని ఆశ్రయించానని తెలిపారు. తన విన్నపాన్ని స్వీకరించిన గౌరవ న్యాయస్థానం వెంటనే చెక్‌ పవర్‌ రద్దును నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులలో ఆదేశించించిందన్నారు. తాను మండలంలో తమ గ్రామాన్ని (కొత్తపల్లి) అన్ని విధాలుగా అభివద్ధి చేసి, జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ సర్పంచ్‌గా జిల్లాకలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నానని తెలిపారు. కాగా నిధులు దుర్వినియోగం చేశానని చెప్పి ఉపసర్పంచ్‌, ఆమె భర్త తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా తనను అభాసు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ పదవి నుంచి తొలగించాలని గ్రామ వార్డు సభ్యులు తీర్మానం చేయడం మూలంగానే ఆమెను అప్పటి గౌరవ కలెక్టర్‌ తొలగించడంతో గ్రామ వార్డు సభ్యుల తీర్మానం మేరకే మరో సభ్యులైన సోమశేఖర్‌ను జాయింట్‌ చెక్‌ పవర్‌ బాధ్యతలను అప్పగించామని పేర్కొన్నారు. అప్పటి నుంచే గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉన్న సోమశేఖర్‌తో డిజిటల్‌ సంతకంతోనే పనుల బిల్లుల చెల్లింపులు జరిపిస్తున్నట్లు వెల్లడించారు. మళ్ళీ ఉపసర్పంచ్‌ అంజలి పేరున బాధ్యతలను పునరుద్ధరణ చేయాలని అధికారులు ఆదేశిస్తూ పంచాయతీ కార్యదర్శికి ఉత్తర్వులు అందితే తిరిగి డిజిటల్‌ సంతకం మార్పు చేయవల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిపై ఉంటుందన్నారు. బాధ్యతలు తీసుకొనే బాధ్యత ఉప సర్పంచ్‌ అయిన అంజలికి ఉంటుంది కానీ సర్పంచ్‌ పై ఉండదని తెలియచేస్తూ పంచాయతీ కార్యదర్శి తప్పిదాలను తనపై రుద్దుతూ రాజకీయంగా పరువు తీయాలని దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులను తప్పు దోవ పట్టించి చెక్‌ పవర్‌ రద్దు చేయించారని దుయ్యబట్టారు. ఉపసర్పంచ్‌ సస్పెండ్‌ అయిన నాటి నుంచి ప్రతి నెల జరిగే గ్రామ పంచాయితీ మీటింగ్‌లకు కూడా రాకుండా తనపైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఏదైనా ఉంటే ప్రజల మన్ననలు పొందడానికి గ్రామాభివద్ది చేసి చూపించాలే తప్ప రాజకీయంగా ఎదుర్కొలేక, లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని జగన్నాథం హితవుపలికారు. ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుందనడానికి ఇది నిదర్శనమని సర్పంచ్‌ స్పష్టం చేశారు.