గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం–  75 తెగలను ఆదివాసీలుగా గుర్తించాం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందనీ, 75 తెగలను ఆదివాసీలుగా గుర్తించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. వాటిలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ మంత్రి రవీంద్రనాయక్‌, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రధాని అయ్యాకే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిందని తెలిపారు. తమ ప్రభుత్వం గతేడాది గిరిజన సంక్షేమం కోసం లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని వివరించారు. సోమవారం నుంచి ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నదని తెలిపారు. అర్హులైన ఆదివాసీలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. వంద ఆదివాసీ హాస్టళ్లు కట్టించబోతున్నామని చెప్పారు. పలు ఆదివాసీ గ్రామాల్లో కరెంటు వెలుగులు అందించబోతున్నామనీ, 72 వేల ఆధార్‌ కార్డులు, 83 వేల ఆయుస్మాన్‌ భవ హెల్త్‌ కార్డులు, 49 వేలకు పైగా క్యాస్ట్‌ సర్టిఫికెట్స్‌, 32 వేలకుపైగా రేషన్‌కార్డులు అందించబోతున్నామని వివరించారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సీ పాఠశాలల ద్వారా మూడు లక్షల ఆదివాసీ విద్యార్థులకు చదువు అందించబోతున్నామని చెప్పారు. తెలంగాణకు ట్రైబల్‌ యూనివర్సిటీ ఇచ్చామనీ, తాత్కాలిక యూనివర్సిటీ ద్వారా విద్య అందిస్తామని తెలిపారు. ట్రైబల్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో భూపాలపల్లి, అసిఫాబాద్‌, భద్రాచలం ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలు గుర్తించామనీ, అక్కడ ట్రైబల్‌ టూరిజం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సోమవారం వర్చువల్‌ గా 18 రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని మాట్లాడుతారని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలోనూ, తెలంగాణలోనూ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించామన్నారు. ఐఎస్‌ఐ ద్వారా మతకలహాలను ప్రేరేపించి భారత్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న పాకిస్తాన్‌ ఎత్తుగడను తిప్పికొట్టామన్నారు. ఇండియన్‌ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీ గా ముద్రించి,ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్‌ నడిపడాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పారు. నేడు పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదనీ, ఒకరినొకరు చంపు కుంటున్నారని చెప్పారు.ప్రజలు శాంతియుతంగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చడం లేదని విమ ర్శించారు. కొందరు కావాలనే రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్నారనీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని తెలిపారు. గతంలో గెలిచిన ఎంపీ సీట్లను కూడా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ గెలవదని నొక్కిచెప్పారు. రాహుల్‌గాంధీ ఏడాదిలో రెండు నెలలు విదేశాల్లో విహారం చేస్తారని విమర్శించారు.