భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం

భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం–  ప్రతి గ్రామంలోనూ భూ న్యాయ శిబిరం నిర్వహణ : యాచారంలో ఫైలెట్‌ ప్రాజెక్టు అంకురార్పణలో లీఫ్స్‌ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా, భూ చట్టాలను రైతులకు చుట్టాలుగా మార్చడమే ధ్యేయంగా యాచారం మండలంలో ఫైలెట్‌ ప్రాజెక్టుకు అంకురార్పరణ చేస్తున్నామని లీఫ్స్‌ సంస్థ అధ్యక్షులు, ధరణి కమిటీ సభ్యులు, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలోని భూ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలనే సంకల్పంతో భూ న్యాయ శిబిరాలకు శ్రీకారం చుట్టామన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ (సీఎంఆర్‌ఓ) వి.లచ్చిరెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డితో కలిసి పైలెట్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. భూ సమస్యల వివరాల నమోదుకు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ భూమి కలిగిన ప్రతివారు ఒక్కసారైనా ఈ భూ హక్కుల పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తమ భూ హక్కులను కాపాడుకోవడంతో పాటు భూ సమస్యల నుంచి బయటపడే మార్గం తెలుస్తుందన్నారు. సమస్యేంటి? చట్టప్రకారం సమస్యకు పరిష్కార మార్గమేంటి? ఎవరిని సంప్రదించాలి? లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఈ భూ న్యాయ శిబిరానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా యాచారం మండల పరిధిలోని 21 గ్రామాల్లో భూ న్యాయ శిబిరాలు నిర్వహిస్తామనీ, అందులో గుర్తించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎవరైనా రైతులు ఫోన్‌ చేస్తే భూ సమస్యల పరిష్కారానికి ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు. సీసీఎల్‌ఏ ధరణి ప్రాజెక్టు డైరెక్టర్‌ (సీఎంఆర్‌ఓ) వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు. భూ న్యాయ శిబిరం కార్యక్రమం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణిలో సమస్యలు, సవరణలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. భూ న్యాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో లీఫ్స్‌ సంస్థ ఉపాధ్యక్షులు జీవన్‌రెడ్డి, న్యాయవాదులు మల్లేశం, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, సలహాదారు కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.