కేరళలో నేటి నుంచి ఈ-పాలన


తిరువనంతపురం : ఎల్డీఎఫ్‌ పాలనలో కేరళ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంటున్నది. నేటి నుంచి ఆ రాష్ట్రం పూర్తి స్థాయి ఈ-పాలన రాష్ట్రంగా అవతరించనున్నది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించనున్నారు. ఈ-పాలనతో ప్రభుత్వ సేవలు డిజిటల్‌ రూపంలో, పారదర్శకంగా, శీఘ్రంగా అందనున్నాయి. డిజిటల్‌ అక్షరాస్యతను సాధించటంతో పాటు కేరళను ‘మొత్తం ఈ-పరిపాలన గల రాష్ట్రం’గా ప్రకటించటం అనేది విజ్ఞాన ఆధారిత సమాజం, ఆర్థిక వ్యవస్థ వైపు దక్షిణాది రాష్ట్ర ప్రయాణంలో ఒక ప్రధాన అడుగు అని కేరళ ప్రభుత్వం తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. కేరళ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన భారత రాష్ట్రంగా అవతరించి, సంపూర్ణ ఈ- అక్షరాస్యత సమాజంగా మారాలనే తపనను ప్రారంభించిన దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ అద్వితీయ విజయం.. ప్రభుత్వం కోరుకునే దూర దృష్టితో కూడిన విధాన కార్యక్రమాల ద్వారా గ్రహిం చబడిందని వెల్లడించింది. కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ (కేఎఫ్‌ఓఎన్‌) ఈ దిశలో నిర్ణయాత్మక ముందడుగు అవుతుందనీ, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పౌరుల హక్కుగా ప్రకటించిన భారత రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని వివరించింది.
భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్‌ ఈ-సర్వీస్‌ డెలివరీ అంచనాలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది అని పేర్కొన్నది.