షర్మిలతో వైసిపికి కచ్చితంగా నష్టమే

– నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు
కాళ్ల: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల ప్రభావంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నష్టం కలుగుతుందని నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఆమె చాలామంది ఓటర్లను ప్రభావితం చేస్తారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలోని తన నివాసంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రభుత్వ సొమ్ము నొక్కేయడమే గాని, ఖర్చు చేయడం తెలియదని ఆరోపించారు. జగన్‌ తనకు ఏనాడు సాయం చేయలేదని, తాను జైలులో ఉండగా సాయం చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తనకు నిజమైన మిత్రులని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించినందునే జగన్‌ తనపై పగబట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన 135 స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్పారు.