చమన్‌లాల్‌ పేపర్‌ మిల్లు వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం

చమన్‌లాల్‌ పేపర్‌ మిల్లు వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం– మత్యువాత పడుతున్న పశువులు, మేకలు
– పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-కొత్తూరు
చమన్‌లాల్‌ పేపర్‌ మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలను తీసుకువచ్చి బహిరంగ ప్రదేశంలోని ప్రభుత్వ భూమిలో విచ్చలవిడిగా డంపింగ్‌ చేస్తున్నారు. వ్యర్ధాలతో భూగర్భ జలాలు కలుషితమై పశువులు, మేకలు మత్యువాత పడుతున్నాయి. పరిశ్రమలలో సైతం పెద్దపెద్ద గుంతలు తీసి పరిశ్రమ నుండి వచ్చే కలుషిత నీరు అందులోకి వదులుతుండడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చుట్టుపక్కల బోరు బావులలోని నీరు కలుషితమవుతుండటంతో చర్మవ్యాధులు సైతం వస్తున్నాయి. సదరు పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని తీగపూర్‌ గ్రామపంచాయతీ సమీపంలో గల చమన్‌ లాల్‌ పేపర్‌ మిల్లు పరిశ్రమ నుండి నిత్యం వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి గ్రామానికి సమీపంలో గల ప్రభుత్వ భూమి సర్వేనెంబర్‌ 126/5లో డంపింగ్‌ చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమై స్థానిక వ్యవసాయదారుల పశువులు, మేకలు మత్యువాత పడుతున్నాయి. సదరు పరిశ్రమ యజమానులు విచ్చలవిడిగా వ్యర్థాలను బయటికి వదులుతున్న అధికారుల మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పలుమార్లు చెప్పిన పరిశ్రమ యజమానుల తీరు మారకపోవడం సిగ్గుచేటని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన రైతు ఎల్లారెడ్డి బుధవారం చమన్‌ లాల్‌ పేపర్‌ మిల్‌ పరిశ్రమ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ జానకికి ఫిర్యాదు చేశాడు.