వణికించే చలిలో వేడి వేడి సూప్స్‌

భోజనానికి ముందు మాత్రమే కాదు… వణికించే చలిలో… వీలున్నప్పుడల్లా వేడివేడిగా సూప్‌ తాగితే కలిగే హాయి అంతా ఇంతా కాదు. అలాగని కాసిని నీళ్లూ రెండు కూరగాయ ముక్కలు వేసి మొక్కుబడిగా కాకుండా.. పోషకాలను అందించే వివిధ రకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.

యాపిల్‌ గుమ్మడి సూప్‌
కావాల్సిన పదార్థాలు : తరిగిన యాపిల్‌ ముక్కలు – రెండు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అలీవ్‌నూనె- రెండు చెంచాలు, మైదా పిండి – చెంచా, కూరగాయలు ఉడికించిన నీళ్లు – నాలుగు కప్పులు, కొద్దిగా ఉడికించిన గుమ్మడి ముక్కలు – మూడు కప్పులు, చెక్కెర – రెండు చెంచాలు, అల్లం, ఉరికాయలతో చేసిన పొడి – అరచెంచా, యాపిల్‌ రసం – కప్పు, ఉప్పు, మిరియాల పొడి- రుచికి తగినంత
తయారు చేసే విధానం : వెడల్పాటి కడాయిలో ఆలివ్‌నూనె వేడి చేసి యాపిల్‌, ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. ఆ తర్వాత మైదాపిండి వేసి కూరగాయలు ఉడికించిన నీళ్లు కలపాలి. పది నిమిషాలకు ఇది చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. ఇందులో గుమ్మడిముక్కలు, చెక్కెర, మసాలా పొడి వేసి మంట తగ్గించి కనీసం ఇరవై ఐదు నిమిషాలు మరగనిచ్చి దింపేయాలి. ఇదంతా చల్లారాక మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ ఐదు నుంచి పది నిమిషాలు వేడి చేసి తగినంత ఉప్పు, మిరియాల పొడి, యాపిల్‌ రసంను వేసి తర్వాత కప్పుల్లోకి సర్వ్‌ చేసుకోవచ్చు. ఇష్టపడే వారు ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా కూడా తీసుకోవచ్చు.

గుమ్మడి, వాము సూప్‌
కావాల్సిన పదార్థాలు : గుమ్మడి ముక్కలు – అరకేజీ, ఆలివ్‌నూనె – రెండు చెంచాలు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బ – ఒకటి, వాము – పావుకప్పు (దొరికితే వాము ఆకులు కూడా చేసుకోవచ్చు), కూరగాయలు ఉడికించిన నీళ్లు – మూడున్నర కప్పులు, వెన్న తీసిన పాలు – ముప్పావు కప్పు, బేసిల్‌ పెస్టో – రెండు చెంచాలు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి తగినంత
తయారు చేసే విధానం: గిన్నెలో ఆలివ్‌నూనెను వేడిచేసి గుమ్మడి ముక్కల్ని వేయించాలి. పదిహేను నిమిషాలయ్యాక ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేలయించాలి. ఇందులో వాము వేసి కూరగాయలు ఉడికించిన నీళ్లు కూడా పోసి మూతపెట్టేయాలి. పదిహేను నిమిషాలకు కూరముక్కలు మెత్తగా అవుతాయి. ఆ తర్వాత మిక్సీలో వేసి ప్యూరీలా చేసి వెన్న తీసిన పాలు కలిపి మరోసారి వేడిచేయాలి. రెండు మూడు నిమిషాల య్యాక బేసిల్‌ పెస్టో వేసి దింపేసేయాలి. పసందైన సూప్‌ సిద్ధం.

చికెన్‌ బ్రౌన్‌ రైస్‌ సూప్‌
కావాల్సిన పదార్థాలు : ఉప్పు కలపని రిటెన్‌ స్టాక్‌ – ఎనిమిది కప్పులు, ఉల్లిపాయ – ఒకటి, క్యారెట్లు – మూడు, కొత్తిమీర- రెండు కట్టలు, నీళ్లు- రెండు కప్పులు, బ్రౌన్‌ రైస్‌ – రెండు కప్పులు, చికెన్‌ ముక్కలు – పావుకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, పాలకూర – కట్ట, ఉప్పు, మిరియాలపొడి -రుచికి తగినంత
తయారు చేసే విధానం : కాస్త మందపాటి గిన్నెలో అరకప్పు చికెన్‌ సాక్‌ను మరిగించాలి. అందులో ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర వేసి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఎనిమిది నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు మిగిలిన చికెన్‌ స్టాక్‌, నీళ్లు, బియ్యం, చికెన్‌ ముక్కలు, బిర్యానీ ఆకు ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. మంట తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించాలి. అన్నం చికెన్‌ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర తరుగు వేయాలి. ఐదు నిమిషాలయ్యాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి కలిపి కప్పుల్లోకి తీసుకుంటే సరిపోతుంది.

గార్డెన్‌ బేసిల్‌ సూప్‌
కావాల్సిన పదార్థాలు: టమాట ముక్కలు – రెండు కప్పులు, కీరదోస – మూడు, ఉల్లిపాయ, క్యాపుకం ఒక్కోటి చొప్పున, కొత్తిమీర తరుగు- పావుకప్పు, క్యారెట్లు – నాలుగు, బేసిల్‌ పెస్టో – పావుకప్పు (ఇది బజార్లో దొరుకుతుంది) లేదంటే కొత్తిమీర పేస్టు కూడా ఉపయోగించుకోవచ్చు) పాలకూర – కట్ట, ఆలివూనె- రెండు చెంచాలు, కూరగాయలు ఉడికించిన నీళ్లు – అరకప్పు, ఉప్పు-తగినంత, మిరియాల పొడి- రుచికి సరిపడా, టమాట పేస్టు – నాలుగు చెంచాలు
తయారు చేసే విధానం: గిన్నెలో ఆవనూనెను వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర తరుగును వేసి వేయించాలి. అవి కాస్త మగ్గాక కీరదోస ముక్కలు, పాలకూర ఆకులు చేర్చాలి. పాలకూర ఆకులు కొద్దిగా మెత్తగా అయ్యాక టమాట ముక్కలు, టమాట పేస్టు, పెస్టో సూప్‌ను కూరగాయలు ఉడికించిన నీళ్ళను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి కూరముక్కలు మెత్తగా ఉడుకుతాయి. అప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి మరో పదిహేను నిమిషాలు మరిగించాలి. చివరగా బేసిల్‌ పెస్టో వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేస్తే సరి.

కీర, బ్రకోలీ సూప్‌
కావాల్సిన పదార్థాలు : ఆలివ్‌నూనె – రెండు చెంచాలు, ఉల్లిపాయ – సగం, కీరదోస – ఐదు, బ్రకోలీ పువ్వులు – అరకప్పు (దీనికి బదులు క్యాలీఫ్లవర్‌ కూడా వాడొచ్చు), ఉప్పు కలపని చికెన్‌ స్టాక్‌ – కప్పు, డ్ర – క్రీం – ముప్పావు కప్పు, ఉప్పు మిరియాల పొడి – రుచికి తగినంత
తయారు చేసే విధానం:  మందపాటి కడాయిలో ఒకటి ముప్పావు చెంచా ఆలివ్‌నూనెను వేడిచేసి ఉల్లిపాయ, కీరదోస, బ్రకోలి ముక్కల్ని వేసి వేయించాలి. పదినిమిషాలయ్యాక చికెన్‌ స్టాక్‌ని కలపాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే మరో పది నిమిషాలకు కూరముక్కలు ఉడుకుతాయి. అప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో గిలక్కొట్టిన క్రీం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేయాలి. ఈ సూప్‌ను మరో ఐదు నిమిషాల పాటు వేడిచేసి మిగిలిన అలివ్‌నూనెను వేస్తే సరిపోతుంది.