నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమపై తాము దృష్టి పెట్టే వారు జీవితంలో విజయం సాధిస్తారని కేంద్ర మాజీ విద్యా కార్యదర్శి అనిల్ స్వరూప్ తెలిపారు. ఇలాంటి వారు ఇతరుల తప్పులను వెతికే పని పెట్టుకోరని చెప్పారు. విజయులుగా నిలిచిన వారి జీవితాలు గమనిస్తే ఇదే విషయం అవగతమవుతుందని వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) పీజీడీఎం మూడో బ్యాచ్ పీజీడీఎం(హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ) 16వ బ్యాచ్ స్నాతకోత్సవం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ స్వరూప్ మాట్లాడుతూ గతాన్ని మార్చే శక్తి లేనందున దాన్ని గురించి చింతిచకుండా వర్తమానం గురించి ఆలోచించాలని సూచించారు. నియంత్రించలేని విషయాలను గురించి ఆందోళన వీడి ప్రభావితం చేయగలిగిన సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఆందోళన మనిషికి ప్రతికూల ప్రభావాన్ని ఇస్తుందని హెచ్చరించారు. చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసించాలనీ, తద్వారా వారికి పనులు అప్పగించడం సులభమవుతుందన్నారు. తప్పుల నుంచి నేర్చుకునే అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రత్యేక పతకాలు, అవార్డులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో అస్కీ చైర్మెన్ కె.పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.