– ఇరాన్లో తమ రాయబారిని వెనక్కి పిలిపించిన పాక్
ఇస్లామాబాద్: ఇరాన్‌లోని తమ రాయబారిని పాకిస్తాన్ బుధవారం వెనక్కి పిలిపించింది. పాకిస్తాన్లో సున్నీ వేర్పాటువాద గ్రూపు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపిన మరుసటి రోజు పాక్ ఈ చర్య తీసుకుంది. పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ గగన తలాన్ని ఉల్లంఘించి, ఇద్దరు చిన్నారుల మృతికి కారణమయ్యారంటూ పాకిస్తాన్ ఈ దాడిని తీవ్రంగా నిరసించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగ శాఖకు తమ నిరసనను పాక్ తెలిపింది. ఇరాన్ రాయబారిని పిలిపించి పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిన ఈ దాడిని తీవ్రంగా ఖండించినట్లు తెలియజేసింది. ఈ దాడి పర్యవసానాలకు బాధ్యత కచ్చితంగా ఇరాన్‌దేనని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇరాన్ రాయబారి ప్రస్తుతం సొంత దేశంలో పర్యటిస్తున్నారు. ఆయనను తిరిగి పాక్‌కు వచ్చేందుకు అనుమతించేది లేదని పాక్ పేర్కొంది. ఈ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నెల ఆరంభంలో ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడి 90మంది మరణానికి కారణమయ్యారంటూ ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేసింది.