– ఆందోళన అవసరం లేదు
– ఏఐజీ డాక్టర్ల బృందం నిరంతర పర్యవేక్షణ
– హైదరాబాద్‌కు సందర్శకులు రావొద్దు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు
– డిప్యూటీ సీఎం సహా పలువురి పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మినేనిని మంగళవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. బుధవారం రాఘవులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతున్నదని చెప్పారు. రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారని అన్నారు. ఆయన కోలుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బీపీ స్థిరంగా ఉందనీ, మూత్ర పిండాలు, గుండె సాధారణ స్థితిలో ఉన్నాయని వివరించారు. అయితే సందర్శకులు ఎక్కువగా వస్తున్నారనీ, అలా రావడం వైద్యులకు, ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలంటే సందర్శకుల సంఖ్య ఎంత తక్కువుంటే అంత మంచిదని అన్నారు. శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడొద్దని అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ తమ్మినేని త్వరగా కోలుకుంటారని అన్నారు. అందుకోసం ఏఐజీ డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. తమ్మినేని ఆరోగ్యం గురించి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్, విజయరాఘవన్ అడిగి తెలుసుకుం టున్నారని వివరించారు. డాక్టర్లతో సంప్రదిస్తు న్నారని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ తమ్మినేని ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరగా కోలుకుంటారనీ, ప్రజాజీవితంలోకి తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం సహా పలువురి పరామర్శ
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ సీనియర్ నేత, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీలు వి హనుమంతరావు, పి మధు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏఐజీ ఆస్పత్రికి వచ్చి తమ్మినేనిని పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, డిజి నరసింహారావు, పి ప్రభాకర్, మల్లు లక్ష్మితోపాటు పలువురు రాష్ట్ర నాయకులున్నారు.
ఆరోగ్య బులెటిన్ విడుదల
‘తమ్మినేని వీరభద్రం ప్రాథమిక చికిత్సకు స్పందిస్తు న్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. కొద్దిపాటి మందుల సహాయంతో బీపీ స్థిరంగా ఉంది. మాట్లాడిస్తుంటే స్పందిస్తున్నారు. తదుపరి 24-48 గంటలు చాలా కీలకమైనవి. ఆస్పత్రి క్రాస్ ఫంక్షనల్ వైద్యుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూనే ఉన్నది. అందుకనుగుణంగా నిరంతర వెంటిలేటర్ అవసరంతో సహా భవిష్యత్ చికిత్సను కొనసాగిస్తారని వైద్యులు నిర్ధారించారు.’అని ఏఐజీ ఆస్పత్రి ఆరోగ్య బులెటిన్‌లో బుధవారం వెల్లడించింది.