ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

– అధికారుల ఫిర్యాదు.. సీసీఎస్‌లో కేసు నమోదు
– అన్ని కోణాల్లో విచారిస్తున్న అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరుతో నకిలీవెబ్‌సైట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నకిలీ వెబ్‌సైట్‌ ఏదో, అసలైన బోర్డు వెబ్‌సైట్‌ ఏదో తెలియని అయోమయం నెలకొంది. గుర్తించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు వెంటనే సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యార్థులకు సంబంధించిన డేటాను అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in., www.bse.telangana.gov.in ద్వారా సేకరిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను జిల్లా విద్యాధికారులు, సెకెండరీ స్కూల్స్‌ హెడ్స్‌ అపరేట్‌ చేసేందుకు అవకాశముంటుంది. బోర్డుకు సంబంధించిన కంప్యూటర్‌ వర్క్‌ సికింద్రాబాద్‌లోని మ్యాగటిక్‌ ఇన్ఫోటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో బోర్డు అసలైన వెబ్‌సైట్లను పోలినట్లుగా రెండు (bseelangana.co.in, bsetelanganagov.in) నకిలీ వెబ్‌సైట్లను గుర్తించిన సంస్థ ఈ విషయాన్ని అధికారులకు తెలిపింది. దీంతో ఈ నకిలీ వెబ్‌సైట్లను తొలగించి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టర్‌ అప్‌ ఎగ్జామినేషన్‌ విభాగం డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.