
– ఈ నెల 20న నోటీసులు, 29న నిర్వహణ
– 1-8వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పోటీచేసే అవకాశం.
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి, ఇతరత్రా కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునే ఎస్ఎంసి (స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ) ఎన్నికలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాల స్థాయిలో ఎస్ఎంసి చైర్మన్, వైస్ ఛైర్మన్లను 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా చేతులెత్తి ఎన్నుకునే విధానం చేపట్టనున్నారు.చివరిసారిగా 2019 నవంబర్ లో ఎస్ఎంసి చైర్మన్ల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది.ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుంది.మండలంలో 5 జిల్లా పరిషత్,రెండు ప్రాథమికోన్నత,27 ప్రాథమిక,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి.ఇందులో మొత్తం విద్యార్థులు 1853 మంది విద్యానభ్యసిస్తున్నారు.
నేటి నుంచి ప్రక్రియ ..
మండలంలోని 15 గ్రామాల్లో 37 పాటశాలకు స్కూల్ కమిటీ ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.మొదట పాఠశాలల పరిధిలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనే విధంగా హెచ్ఎం శనివారం ఉదయం నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది.అదేరోజు విద్యార్థులు తల్లిదండ్రుల పేర్లను పాఠశాలల ఆవరణలో ప్రదర్షించాలి.22న ఎన్నికల్లో పాల్గొనే తల్లిదండ్రుల జాబితపై అభ్యంతరాల స్వీకరణ,24న పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రదర్శిస్తారు.29వ తేదీన ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు చేతులెత్తే విధానంలో ఎన్నుకోవాల్సి ఉంటుంది.అనంతరం 2 గంటల నుంచి 4వరకు కొత్తగా ఏర్పడిన కమిటీతో సమావేశం నిర్వహించి, పాఠశాలలోని విషయాలపై చర్చిస్తారు.
ప్రశాంత వాతావరణంలో..
ఎంఈఓ దేవా నాయక్ ప్రభుత్వ ఆదేశాలమేరకు ఎస్ఎంసి ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ జోవోను ప్రధానోపాధ్యాయులు క్షుణ్ణంగా చదివి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి.ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలు ప్రశంత వాతావరణంలో జరిగేoదుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.