– భూమి విలువ మార్పిడితో బీఆర్‌ఎస్ నేత మాయ?
– ఎకరం రూ.4.50 లక్షల భూమిని రూ.30 లక్షలుగా మార్పిడి
– జిన్నింగ్ మిల్లు రుణం కోసం భూ విలువ పెంచినట్టు ఆరోపణలు
– ఆగస్టులో కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు.. ఐదు నెలల తర్వాత విచారణ
– ధరణిలో ఇలాంటి మాయలెన్నైనా చేయొచ్చంటున్న నిపుణులు
ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం నుంచి కె.శ్రీనివాసరెడ్డి
ధరణిని అడ్డుపెట్టుకుని కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు చేసిన లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం ఓ ప్రయివేటు సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పగించడంతో దానిలో రాత్రికి రాత్రే అనుకూల చేర్పులు మార్పులు చోటు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని రెవెన్యూ సర్వే నంబర్ 474లో వెలుగు చూసింది. ఈ గ్రామ రెవెన్యూలోని అన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం భూమి రూ.4.50 లక్షలు ఉండగా 474 సర్వే నంబర్‌లో మాత్రం రూ.30.49 లక్షలుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆ సర్వే నంబర్‌లో 14 ఎకరాల వరకు భూమి ఉన్న 13 మంది రైతులు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు గతేడాది ఆగస్టు 3న ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఐదు నెలల తర్వాత దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు.
బ్యాంకు నుంచి అధిక రుణం కోసమే ఎత్తుగడ..!
కూసుమంచి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నేత ఒకరు బ్యాంకుల నుంచి అధిక రుణం పొందేందుకు తన భూముల విలువ పెంచుకోవడంలో భాగంగా ఈ వ్యూహం పన్నినట్టు సంబంధిత రైతులు ఆరోపిస్తున్నారు. సదరు బీఆర్‌ఎస్ నేతకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రెవెన్యూలోని 474 సర్వే నంబర్‌లో 1.10 ఎకరాలు, 466 సర్వే నంబర్‌లో 2 ఎకరాల భూమి ఉంది. సంబంధిత నేత కూసుమంచి మండలంలో మిల్లు కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. అందుకు తన ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఎక్కువ రుణం పొందే ఆస్కారం ఉండటంతో ఈ వ్యవహారానికి పాల్పడ్డాడని రైతులు ఆరోపిస్తున్నారు. 474తో పాటు 466 సర్వే నంబర్‌లోని భూమి విలువను కూడా ఇలాగే పెంచి ధరణి పోర్టల్‌లో నమోదు చేసినట్టు తెలుస్తోంది. కానీ 474 నంబర్‌పైనే ఫిర్యాదు రావడంతో ఈ సర్వేనంబర్ భూ విలువపైనే విచారణ చేస్తున్నారు.
గతంలోనే మాయ.. ధరణిలోనూ కొనసాగింపు..
2020లో నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో భూముల విస్తీర్ణం, విలువలు, సర్వే నంబర్లను పక్కాగా నమోదు చేయొచ్చని పేర్కొంది. పారదర్శకతకు మరో పేరుగా ధరణిని అభివర్ణించింది. కానీ పోర్టల్‌తో రైతుల భూ సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు వచ్చిచేరాయి. గతంలోని మాయలను సైతం ధరణిలోనూ కొనసాగించడంతో రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. కూసుమంచి మండలానికి చెందిన నేత ఆరేండ్ల క్రితం రాజేశ్వరపురం రెవెన్యూలో 474, 466 సర్వే నంబర్లలో సుమారు 3.10 ఎకరాల భూమి తీసుకున్నాడు. జిన్నింగ్‌మిల్లు స్థాపనకు రుణం కోసం ఆనాడు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం రూ. 2 లక్షల చొప్పున తన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత 466 సర్వేనంబర్‌లో పారాబాయిల్డ్ రైసు మిల్లు ఏర్పాటు పేరుతో భూమి విలువ పెంచుకునేందుకు వీలుగా వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించుకున్నాడు. దాంతో నాడు ఎకరం రూ.2 లక్షలున్న భూమి విలువ ఒక్కసారిగా రూ.14.5లక్షలకు చేరింది. రెండేండ్ల క్రితం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ రిజిస్ట్రే షన్ విలువలను పెంచ డంతో నాడు రాజేశ్వ రపురం రెవెన్యూలో ఉన్న భూములన్నీ ఎకరం రూ.2 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు చేరాయి. కానీ 466, 474 సర్వే నంబర్‌లోని భూములు మాత్రం వ్యవసాయేతర నంబర్లుగా నమోదు కావడంతో ఎకరం రూ.14.5 లక్షల నుంచి రూ.30.45లక్షలకు చేరాయి. వ్యవసాయేతర భూము లుగా ఈ రెండు సర్వే నంబర్లు నమోదైన ప్పటికీ ఇన్నిరోజులుగా రైతుబంధు వస్తుండటం, ఈ సర్వేనంబర్లలోని ఏ రైతూ భూములు అమ్మకానికి పెట్టకపోవడంతో ఈ విషయాలేవీ బయటకు రాలేదు. 474 సర్వే నంబర్‌లో ఉన్న చావా లెనిన్ బాబు తనకున్న మూడు ఎకరాల్లో కొంత భూమిని ఇదే గ్రామానికి చెందిన పుసునూరి వాసుకు విక్రయిం చాడు. రూ.10లక్షల బయానాను వాసు చెల్లించారు. తీరా రిజిస్ట్రేషన్ దగ్గరకు వెళ్లే సరికి భూ విలువ అధికంగా ఉండటం మూలంగా భారీగా ట్యాక్స్‌లు చెల్లించాల్సి వచ్చింది. దాంతో భూక్రయ, విక్రేతల మధ్య గొడవలు తలెత్తడంతో అసలు విషయం బయ టకు వచ్చింది. కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేయడం, బీఆర్‌ఎస్ నుంచి అధికారమార్పిడి జరగడంతో ఇప్పుడు ‘తీగలాగితే డొంక కదిలే’ దిశగా వ్యవహారం వెళ్తోంది.
మార్కెట్ విలువే రూ.30లక్షలు లేదు
మా రాజేశ్వరపురం రెవెన్యూలో మెయిన్‌రోడ్డు భూములే మార్కెట్ విలువ ప్రకారం రూ.30లక్షలకు పైగా పలకట్లేదు. అటువంటిది 474, 466 సర్వేనంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ విలువను రూ.30 లక్షలకు పైగా ధరణిలో చూపెడుతుండటంతో మేము భూములు అమ్ముకోలేకపోతున్నాం. భూములు కొన్నవాళ్లు ట్యాక్స్‌ల రూపేణ భారీ మొత్తాలను చెల్లించాల్సి రావడంతో మాకొద్దని గొడవ పడుతున్నారు. అందుకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ధరణితో ఇలాంటి ఇబ్బందులు అధికమయ్యాయి.
– దండ రంగయ్య, బాధిత రైతు
తప్పు సరిచేయాలంటే పెద్ద ప్రాసెస్..
ధరణిలో చోటుచేసుకున్న ఈ తప్పును సరి చేయాలంటే ఓ పెద్ద ప్రాసెస్ అని నిపుణులు చెబుతున్నారు. అడిషనల్ కలెక్టర్, సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్‌లతో కూడిన బృందం విచారణ నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక ఇస్తే.. దాన్ని సీసీఎల్‌ఏకు పంపాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం లభించి విలువను సరి చేయాలంటే పాత విధానం ప్రకారం కనీసం రెండు, మూడేండ్లయినా పడుతుందని చెబుతున్నారు. అదీ నిరంతరం ఫాలోఅప్ చేస్తేనే సాధ్య మవుతుందని అంటున్నారు.