రాహుల్‌ యాత్రపై అసోంలో కేసు

రాహుల్‌ యాత్రపై అసోంలో కేసు– నిబంధనలు పాటించలేదని ఎఫ్‌ఐఆర్‌
– తప్పుబట్టిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ తలపెట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’పై అసోంలో కేసు నమోదైంది. జోర్హాట్‌ పట్టణంలో అనుమతించిన మార్గంలో కాకుండా ఇతర మార్గంలో వెళ్లారన్న ఆరోపణలపై యాత్ర చేస్తున్న రాహుల్‌, యాత్ర ప్రధాన నిర్వాహకుడు కె.బి. బైజూలపై జోర్హట్‌ సర్దార్‌ పోలీసు స్టేషన్‌లో రాహుల్‌ యాత్రపై అసోంలో కేసు ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఈ యాత్ర జిల్లా యంత్రాంగ నిబంధనలను పాటించలేదనీ, రోడ్డు భద్రత ప్రమాణాలను ఉల్లంఘించిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ స్పందించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటాన్ని తప్పుబట్టింది. దీనిని ఒక రాజకీయ ఎత్తుగడగా అసోంలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా అభివర్ణించారు. యాత్ర విజయవంతంతో బీజేపీ భయపడుతున్నదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ నుంచి రాహుల్‌ తలపెట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ గురువారం అసోంలోకి ప్రవేశించింది. కాగా, అసోంలో యాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ తీవ్రంగా విమర్శించారు. అసోంలోని హిమంత శర్మ సర్కారు బహుశా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. అసోం సమస్యలను తమ యాత్రలో లేవనెత్తుతామని శివసాగర్‌ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాతే యాత్రపై కేసు నమోదు కావటం గమనార్హం.