– ఓర్వలేక విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు : ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మెన్ అనంతుల శ్యామ్మోహన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దావోస్ వేదికగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మెన్ అనంతుల శ్యామ్మోహన్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేధావుల ఫోరం నేతలు కమలాకర్‌రావు, పాపిరెడ్డి, డాక్టర్ గౌతమ్ ఆకునూరి, జనార్థన్‌రెడ్డి, రామారావుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. టాటా గ్రూప్‌తో ఒప్పందం వల్ల వేలాది ఉద్యోగాలలు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికకానున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచి రేసులో ఉన్నా కొన్ని సమీకరణాలతో మర్చారని వివరించారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం మంచి పదవి ఇస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రెండువేల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు.తమ ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. దాని వల్ల తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనవసర ప్రకటనతో దిగజారిపోతారు బీఆర్ఎస్ నేతలకు వీహెచ్ సూచన
కాంగ్రెస్ పార్టీపై అనవసర ప్రకటనలు చేస్తే దిగజారి పోతారని మాజీ ఎంపీ వి. హనుమంతరావు బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన తీరు బాగాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ దావోస్ వెళ్లారని చెప్పారు. పదేండ్లలో రాష్ట్రాన్ని పాలించి ఏం చేశారని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. భూ సమస్యలపై కమిటీని వేశామనీ, వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.