కర్రు కాల్చి వాత పెట్టినా…బుద్ధి రావడం లేదు

కర్రు కాల్చి వాత పెట్టినా...బుద్ధి రావడం లేదు– సీఎం దావోస్‌ పర్యటనపై ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు
– బంగారు పళ్లెం కాదు… అప్పుల కుప్పను ఇచ్చారు
– బావబామ్మర్దులవి ఝుటా మాటలే.. : కేటీఆర్‌, హరీశ్‌లపై మంత్రి జూపల్లి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనపై బావబామ్మర్ధులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చామంటూ జూటా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని తమకు ఇచ్చారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడినా ఆ పార్టీ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రజలను మోసం చేశారు కాబట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనం కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల అహంకార ధోరణి, కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగి, వేసారి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతుందని భరోసా ఇచ్చారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను కూడా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందనీ, అది తమ ట్రాక్‌ రికార్డు అని చెప్పారు. ఆరు గ్యారంటీల దరఖాస్తుల డిజిటలైజ్‌ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రెండు హామీలను అమలు చేస్తేనే బీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారని చెప్పారు. ఇంకా మిగతా హామీలు అమలు చేస్తే ఆపార్టీ పూర్తిగా తూడ్చిపెట్టుకుపోతుందనే ఆందోళనలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు తిరగబడుతారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌, హరీష్‌ రావు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గల్లంతు అవుతుందో తేలుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావద్దని బీఆర్‌ఎస్‌ నేతలు గట్టిగా కోరుకుంటున్నారనీ, కానీ వారివి పగటి కలలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రావనీ, అందుకే పార్టీని బతికించుకునేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గత పదేండ్లలో బీజేపీతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అంటకాగారని విమర్శించారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారనీ, ఎవరు ముందుకు రావడం లేదన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో కేసిఆర్‌ కుటుంబం తప్ప ఒక్కరు కూడా మిగలరని హెచ్చరించారు. పదేండ్ల కేసీఆర్‌ పాలనలో అవినీతి, అక్రమాలు, కాళేశ్వరంతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు పేరుతో కమీషన్ల కోసం ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో వేల కోట్ల రూపాయాల ప్రజా ధనం నీళ్ల పాలైందనే విషయాన్ని కాగ్‌ నివేదికలే చెబుతున్నాయన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామనీ, ప్రతీ పైసాకు వారు లెక్క చెప్పాల్సిందేనని హెచ్చరించారు.