
ఆళ్ళపల్లి మండలంలో ఓ మహిళ 108 వాహనంలో ప్రసవించినట్లు స్థానిక అంబులెన్స్ ఈ.ఎం.టి పరమ భాగ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. అనంతోగు గ్రామానికి చెందిన పూనెం యశోద అనే నెలలు నిండిన గర్భిణీని స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో నొప్పులు తీవ్రతరం కావడంతో 108 వాహనంలోనే డాక్టర్ గోపీ సూచనల మేరకు కాన్పు చేయడం జరిగిందని తెలిపారు. యశోద మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఆళ్ళపల్లి ప్రభుత్వ హాస్పటల్ లోనే అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. యశోద భర్త కిరణ్ తన భార్య సహజ కాన్పు పట్ల హర్షం వ్యక్తం చేసి, ఈ.ఎం.టి భాగ్య, పైలెట్ పరమ శ్రీహర్ష, ఆశా వర్కర్ అనసూర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతోగు గ్రామం ఆశా వర్కర్ విజయ లక్ష్మి అనంతోగు, ముత్తాపురం, రాయిపాడు గ్రామాలకు చెందిన 9 మంది గర్భిణీ స్త్రీలకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జనరల్ చెకప్ నిమిత్తం తీసుకుని వెళ్లడంతో రామాంజిగూడెం గ్రామం ఆశా వర్కర్ అనసూర్య యశోదకు సేవలు అందించారు.