‘నా సినిమా కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలే ఉన్నాయి. అవి నా కెరీర్‌కు ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు అయన నా బయోగ్రఫీ రాస్తాను అని అనటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చిరంజీవి చెప్పారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రచయిత యండమూరి వీరేంద్ర నాథ్‌కి సాహితీ పురస్కారంతో పాటు రెండు లక్షల రూపాయల నగదును బహూకరించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నిర్వహించిన ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ, ‘నా జీవిత చరిత్ర రాసే బాధ్యతను రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కి అప్పగించారు. నా ఎదుగుదలకి యండమూరి రాసిన రచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. అటువంటి యండమూరి వల్లే నాకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. ఆయన రాసిన ‘అభిలాష’ నవల గురించి మొదట చెప్పింది మా అమ్మగారు. ఆ తరువాత నిర్మాత కెఎస్ రామారావు ఆ నవలని అదే పేరుతో సినిమాగా తీశారు. దానికి కోదండరామి రెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమా నా కెరీర్‌ని సుస్థిర పరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ తరువాత యండమూరి రాసిన ఇంకో నవల ‘ఛాలెంజ్’ని కూడా సినిమాగా తీస్తే, అది అప్పటి యువకుల మీద ఎంతో ప్రభావం చూపించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటివారు. వాళ్ళతో కలిసి నేను నటించటం నా అదష్టంగా భావిస్తాను. ఎన్టీఆర్‌తో ‘తిరుగులేని మనిషి’ సినిమా చేస్తున్నప్పుడు నేను స్వయంగా పోరాట సన్నివేశాలు చేస్తుంటే, అది చూసి ఆర్టిస్టు జీవితం చాలా విలువైనది, రిస్క్ చెయ్యకూడదు, ఏదైనా జరిగితే నిర్మాత నష్టపోతాడు అని చెప్పారు. అప్పట్లో అన్నీ నేనే చెయ్యాలని అనుకుడేవాడిని, ఆ తరువాత ‘సంఘర్షణ’ సినిమా టైంలో గాయపడి, ఆరు నెలలు సినిమాలకి దూరంగా ఉన్నాను. పెద్దవాళ్ళు ఇలాంటివి ఊహించి ముందే చెప్తారు అని అప్పుడు అనుకున్నాను. అలాగే ఎన్టీఆర్ విలాసవంతమైన కార్లు, వస్తువులు కొనడం కన్నా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు కొనమని సలహా ఇచ్చేవారు. ఆయన సలహాతో కొనుక్కున్న ఇళ్ళు, స్థలాలే ఈరోజు నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి’ అని చెప్పారు.