లెనిన్‌ ఓ కాంతి శిఖరం విప్లవోద్యమాలకు దిక్సూచి

Lenin is a peak of light Compass for revolutions– అధ్యయనం ఆచరణల మేళవింపు
–  భౌతికవాదం, ఆచరణవాదం, విమర్శ ఆయన రచనల ప్రత్యేకత
– భౌతిక వాదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విప్లవకారులదే
–  దేశంలో మతోన్మాద భావాలు పెచ్చరిల్లుతున్నాయి
–  లెనిన్‌ రచనల్లో వీటికి సమాధానాలున్నాయి..: లెనిన్‌ శత వర్థంతి సభలో బీవీ రాఘవులు
” లెనిన్‌ మరణించి నూరేళ్లవుతోంది. కానీ ఆయన జీవించిన కాలంలో నిర్వహించిన పాత్ర చరిత్రను వెలిగిస్తూ, వర్తమానాన్ని నడిపిస్తూ, భవిష్యత్‌కు మార్గం చూపుతూనే ఉంది. దోపిడీ అసమానతలు లేని సమాజం కేవలం ఆదర్శం మాత్రమే కాదు, వాస్తవం అని ప్రపంచానికి అనుభవంలోకి తెచ్చిన అక్టోబర్‌ విప్లవ సారథి లెనిన్‌. ఆ మహానాయకుని విప్లవ దార్శనికత ఎప్పటికీ సజీవం” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. చరిత్ర గమనంలో నిన్న, నేడు, రేపు సదా లెనిన్‌ సజీవుడేనని వ్యాఖ్యానించారు. నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లెనిన్‌ జీవితాంతం ఆచరణవాదిగానే ఉన్నారనీ, ప్రతి కమ్యూనిస్టూ ఆయన అడుగుజాడల్లో నడువాలని బీవీ రాఘవులు సూచించారు. దోపిడీ, అసమానతలు, ఆర్థిక సంక్షోభం లేని కష్టజీవుల రాజ్యం రావాలనీ, ఆ దిశగా సోవియట్‌ రష్యా అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్‌ శత వర్థంతి’ సభను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సమాజాన్ని పురోగమనం వైపునకు నడిపించాలనే వారికి లెనిన్‌ ఎప్పటికీ మార్గదర్శకుడేనని చెప్పారు. అధ్యయనం, ఆచరణల మేళవింపు లెనిన్‌ అన్నారు. ప్రతి అంశాన్నీ భిన్న కోణాల్లో అధ్యయనం చేయడం ఆయన వల్లనే సాధ్యమైందన్నారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ల సైద్ధాంతిక అంశాలను లెనిన్‌ మరింత అభివృద్ధి చేశారన్నారు. ఆచరణలో రుజువు చేశవారని చెప్పారు. రష్యన్‌ విప్లవానికీ, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక రాజ్య నిర్మాణానికి అద్భుతమైన నాయకత్వాన్ని అందించారని గుర్తు చేశారు. నాటి పాలక వర్గాలు కష్టజీవులను గందరగోళపర్చటానికి చేసే వాదనలను ఎండగడుతూ విశ్లేషణాత్మకమైన రచనలు చేశారని గుర్తు చేశారు. అప్పటికే సమాజంలో వ్యాపించి ఉన్న సైద్దాంతిక ప్రచారాలను పరిశీలించి వాటిని విమర్శణాత్మకంగా బట్టబయలు చేశారని వివరించారు. భౌతిక వాదం, ఆచరణవాదం విమర్శ ఆయన ముఖ్యమైన రచనగా చెప్పొచ్చన్నారు. భౌతిక వాదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విప్లవ కారులపైనే ఉందన్నారు. ఆ వాదాన్ని రక్షించుకోకపోతే..భావవాదం విస్తారంగా ప్రజల్లో వ్యాపిస్తుందనీ, అది విప్లవానికి ఆటంకంగా తయారవుతుందని చెప్పారు. భౌతికవాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లకపోవడం వల్ల నేడు మన దేశంలో భావవాదం విస్తృతంగా చలామణి అవుతున్నదన్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు భావవాదం పాలకులకు ఒక ఆయుధంగా మారిందని చెప్పారు. దోపిడీని రక్షించటమే భావవాదం లక్షణమని లెనిన్‌ విశదీకరించారని గుర్తుచేశారు. రాజకీయ, సామాజిక, విద్యా తదితర అన్ని వ్యవస్థల్లో భావవాదం ఇమిడి ఉంటుందనీ, దాన్ని నిలువరించే బాధ్యత విప్లవకారులదేనని నొక్కి చెప్పారు. కాలం మారుతున్న కొద్దీ కొత్తకొత్త సవాళ్లు ముందుకు వస్తుంటాయనీ, వాటికనుగుణంగా మన ఆలోచనలు కూడా మార్చుకోవాలని సూచించారు. 1906లో విప్లవం ఓడిపోయిన తర్వాత అంతటా నిరాశ..నిస్పృహలు ఏర్పడ్డప్పుడు లెనిన్‌ నిబ్బరంగా ఉన్నారన్నారు. ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి 1917లో విప్లవాన్ని సాధించారని తెలిపారు. భారతదేశంలో హిందూత్వ భావాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భావవాదాన్ని రోజువారీ యుద్ధంలో ఎలా ఎదుర్కొవాలో లెనిన్‌ రచనలు ఉపయోగపడతాయన్నారు. అదే విధంగా ఆర్థిక శాస్త్రంలో కృషి ఎంతో చేశారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు అర్థం చేసుకునేందుకు ప్రత్యేక రచనలు చేశారన్నారు. 1991లో పరిస్థితి మారిందన్నారు.
భావజాల రంగాన్నంతా పెట్టుబడి తనగుప్పెట్లో పెట్టుకుందన్నారు. ప్రపంచాన్నంతా ఇప్పటికే గుత్తాపెట్టుబడి దారి వర్గం కంట్రోల్‌ చేస్తుందన్నారు. రండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారికంటే..ప్రాంతీయ యుద్ధాల్లో చనిపోయిన వారు 20 రెట్లు ఎక్కువగా ఉంటారని చెప్పారు. ఇంధన వనరులపైన ఆధిపత్యం కోసం తెగల మధ్య ఘర్షణలను సృష్టింటమే సామ్రాజ్యవాద లక్షణమని వివరించారు. సామ్రాజ్య వాదంపై పోరాటంలో శ్రామిక వర్గానికి లెనిన్‌ గొప్ప ఉత్తేజిమిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.