అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయండి

అసెంబ్లీ ఆవరణలో
ఫూలే విగ్రహం ఏర్పాటు చేయండి–  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఎమ్మెల్సీ కవిత వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదర్‌ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామనీ, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఫూలే విగ్రహం కోసం ఉద్యమిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 11న ఫూలే జయంతిలోపు స్పీకర్‌, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుపై ఈ నెల 26న హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలన్న చర్చ దేశమంతా సాగుతోందని చెప్పారు. ఏప్రిల్‌ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్దతుతో వివిధ కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందనీ, బీసీ జన గణన చేపడుతామని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హామీలు ఇచ్చాయని అన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను రెండు పార్టీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.