– గంగాజలం కోసం పయనం
– మురాడి వద్ద మెస్రం వంశీయుల పూజలు
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
కేస్లాపూర్‌లోని నాగోబా జాతర వచ్చేనెల 9న ప్రారంభం కానుంది. నాగోబా పూజకు ఉపయోగించే పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం సాయంత్రం బయల్దేరారు. ముందుగా మురాడి (పురాతన ఆలయం) వద్ద వివిధ గ్రామాల నుంచి వచ్చిన మెస్రం వంశీయులు పీఠాధిపతి వెంకట్‌రావ్ ఆధ్వర్యంలో చర్చించారు. వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. అనంతరం ఖటోడ(పూజారి) హన్మంతు వీపుకు ఝారీ (కలశం)ను భద్రపరిచారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 22 తెగల మెస్రం వంశీయులు, ఖటోడలు మెస్రం కొసు, ప్రధాన్‌జీ లు దాదారావ్, తిరుపతి దర్ముల ఆధ్వర్యంలో గంగాజలం కోసం కాలినడకగా వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఊరి పొలిమేర వరకు వారిని సాగ పంపారు. ఆదివారం కేస్లాపూర్ నుంచి బయలు దేరి కేస్లాగూడలో బస చేస్తారు. 22న గుంజాలకు నార్నూర్, 23న నాగల్కొండ, 24న గౌరీ జైనూర్, 25న గుమ్నూర్, లింగాపూర్, 26న ఇస్లాంపూర్ జన్నాం, 27 న మల్లాపూర్, దస్తురాబాద్, 28న హాస్తిన మడుగులోని పవిత్ర గోదావరికు చేరుకుంటారు. 28న గోదావరి నది వద్ద సాంప్రదాయ పూజలు చేసి కలశం లో పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణం చేసి ఉట్నూర్‌కు చేరుకుంటా రు. అక్కడి నుంచి 30న ఇంద్రవెల్లి మండలం దొడందకు చేరుకుని బస చేస్తారు. వచ్చే నెల 5న ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. 6న కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు వద్దకు చేరుకుని మోదుగు చెట్టుకు గంగాజలం కలశాన్ని భద్ర పరుస్తారు. నాగోబా పూజ అయ్యే వరకు మర్రి చెట్టు వద్దనే సెదతీరుతారు. ఫిబ్రవరి 9న తెచ్చిన పవిత్ర గంగాజలంతో జలాభిషేకం చేసి నాగోబా జాతరను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.