– రాష్ట్ర ఎలక్ట్రోరల్ పరిశీలకులు దేవసేన
– సిరిసిల్లలో 112, 113పోలింగ్ బూత్‌ల తనిఖీ
నవతెలంగాణ – సిరిసిల్ల
జనవరి 1, 2024 నాటికి 18ఏండ్లు నిండిన యువతీ యువకులను తప్పనిసరిగా ఓటరు జాబితాలో చేర్చాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ పరిశీలకులు దేవసేన ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2024లో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం గీతానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 112, 113 పోలింగ్ బూత్‌ల్లో బీఎల్ఓల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సంక్షిప్త, పునరీక్షణ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆమె తనిఖీ చేశారు. పోలింగ్ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు..? స్పెషల్ క్యాంపెయిన్ డేలో భాగంగా ఎంతమంది నుంచి కొత్త ఓటరు నమోదు, సవరణల దరఖాస్తులు స్వీకరించారు..? చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారా..? అనే వివరాలను ఆమె సంబంధిత బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన 6, 7, 8 దరఖాస్తు ఫారాలను బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయా? అనే వివరాలను ఆరా తీశారు.
ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన యువతీ యువకులతో ఆమె మాట్లాడారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో విలువైన ఆయుధమని, ఓటు విలువను తెలుసుకుని, ఎన్నికల్లో తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. మీ స్నేహితుల్లో ఎవరైనా ఓటరు నమోదుకు అర్హులైన వారు ఉంటే వెంటనే వారితో దరఖాస్తు చేయించాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త, పునరీక్షణ కార్యక్రమం జిల్లాలోని 547పోలింగ్ బూత్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. దేవసేనకు వివరించారు. తనిఖీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ షరీఫ్ మోహినుద్దీన్, ఉప తహసీల్దార్ విజరు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.