ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వకూడదు?

ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వకూడదు?– దానివల్ల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెరుగుతాయి
– ప్రజారవాణా ప్రభుత్వాల బాధ్యతే…
– టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర సదస్సులో ప్రొఫెసర్‌ కే నాగేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారనీ, ఈ అవకాశాన్ని పురుషులకూ ఎందుకు వర్తింపచేయకూడదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కే నాగేశ్వర్‌ అన్నారు. ఈ స్కీం కచ్చితంగా మహిళల స్వావలంబనకు ఉపయోగపడుతుందనీ, పురుషులకూ వర్తింపచేస్తే ఆయా కుటుంబాల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెరుగుతాయని విశ్లేషించారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ఆధ్వర్యాన ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్టీసీ అభివృద్ధి- ప్రజల ప్రయోజనాలు-కార్మికుల సంక్షేమం’ అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజారవాణా ప్రభుత్వాల బాధ్యతే అనీ, దాన్ని లాభనష్టాలతో బేరీజు వేయరాదని చెప్పారు. ‘మహాలక్ష్మి’ అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల ప్రయాణాలు 60 శాతం పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయనీ, ఈ పథకం ప్రయోజనాలను రాజకీయపార్టీలే అనుభవిస్తాయి కాబట్టి, వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత కూడా వారే స్వీకరించాలని అన్నారు. అయితే గతంలో ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్‌మెంట్‌ సొమ్ముల్ని సక్రమంగా చెల్లించకపోగా, నష్టాల్లో ఉందని ప్రచారం చేశారని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో రిటైర్‌ అయిన వారికి కూడా సకాలంలో సక్రమంగా బెనిఫిట్స్‌ చెల్లించట్లేదనీ, ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేలా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని ఆకాంక్షించారు. ఉచిత ప్రయాణం, జీరో టిక్కెట్లు, ఇతర రాయితీల సొమ్మును ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తే, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన మార్పులు వస్తాయని సూచించారు. దానికి అవసరమైన సొమ్మును రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించి, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలనీ, కొత్త గ్రామాలకూ ఆర్టీసీ బస్సుల్ని అనుసంధానం చేయాలని కోరారు. లాభనష్టాలతో ఆర్టీసీని ముడిపెట్టడం సరికాదనీ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజారవాణా బాధ్యత ప్రభుత్వాలదే తప్ప, ఆర్టీసీ వంటి సంస్థలది కాదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలు దేశాల్లోని ప్రజారవాణా వ్యవస్థల్ని విశ్లేషించి చెప్పారు. ప్రజరవాణాకు సాంకేతికతను జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ బాధ్యత ప్రజలదే అనీ, కార్మిక హక్కుల సాధనకు ప్రజాసహకారం అత్యవసరమని వివరించారు. ఈ మేరకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ ‘మహాలక్ష్మి’ సొమ్మును ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు అలా చేయకపోవడం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం రవాణారంగంలో అనేక మార్పులు చేసిందనీ, అవి ఆర్టీసీలకు ఇబ్బందిగా మారాయని తెలిపారు. 8 గంటల పనిదినాలను రద్దు చేసి, ఆ స్థానంలో 12 గంటల పనిదినాలు ఏర్పాటు చేస్తున్నారనీ, హిట్‌ అండ్‌ రన్‌ వంటి చట్టాల ద్వారా రవాణారంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందనీ, ఒకప్పుడు టాప్‌ టెన్‌ దేశాల్లో ఒకటిగా ఉండే భారతదేశం ఇప్పుడు కిందికి దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు ‘ఆర్టీసీ అభివృద్ధి- ప్రజల ప్రయోజనాలు- కార్మికుల సంక్షేమం’ అనే మూడు అంశాలపై సదస్సులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజా భాగస్వామ్యం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వాల బాధ్యత, కార్మికుల కష్టనష్టాలనూ వాటిలో ప్రస్తావించారు. సభకు ఫెడరేషన్‌ అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. అంతకుముందు ఫెడరేషన్‌ ఉపాధ్యక్షురాలు పద్మావతి వక్తల్ని వేదికపైకి ఆహ్వానించారు. ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. అంతకు ముందు సదస్సులో వీఎస్‌ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో ఫెడరేషన్‌ ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కోశాధికారి గంగాధర్‌, నాయకులు ఏవీ రావు, బిక్షపతి, కేఎస్‌ రెడ్డి, ఎమ్‌బీ రావు, ఎల్లయ్య, కృష్ణ, సుధాకర్‌, జీఆర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.