విభజన హామీల అమలులో బీజేపీ సర్కార్‌ వివక్ష

విభజన హామీల అమలులో బీజేపీ సర్కార్‌ వివక్ష– వాటి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోరాటం చేయలేదు : ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వివక్ష కనబరించిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. టీజేఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ విభజన హామీల అమలు-కేంద్ర ప్రభుత్వ వివక్షపై నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు, వెనుకబడిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోవడం, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉద్యోగుల విభజనను పూర్తి చేయలేదని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చలేదనీ, రాష్ట్ర స్థాయి సంస్థలు, ఆస్తుల విభజన అంశం పెండింగ్‌లో పెట్టిందనీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో అనేక సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు, రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మద్దతుగా నిలిచి సహకరించిందనీ, ఆయా సందర్భాల్లో విభజన హామీలను సాధించుకునే అవకాశమున్నా… నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, ఆ నదిపై పలు ప్రాజెక్టులతో పాటు రీఇంజినీరింగ్‌ చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పెండింగ్‌లో పెట్టడంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి, తాగు నీటి సమస్య కూడా ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అడ్వకేట్లు, జడ్జిలు రోడ్డెక్కితే గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విభజన జరగలేదని గుర్తు చేశారు. నాడు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉమ్మడిగా పోరాడి విభజన సాధించుకున్నారని తెలిపారు.
ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హక్కులపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్‌ పాలనలో కొనసాగించారని విమర్శించారు. విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూ హక్కులను కాపాడుకుంటూ, విద్యారంగాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. ఇటీవల భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు దాడి చేస్తే బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేశారనీ, ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నుంచి రాజ్యాంగాన్ని, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పిన గత పాలకులు ఆ ఆదాయం దేనికి ఖర్చు చేశారనే ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పలేదని విమర్శించారు. సంక్షేమానికి సంబంధించిన నిటిఅయోగ్‌ విడుదల చేసిన అనేక సూచికల్లో తెలంగాణ వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామచంద్రు నాయక్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇగో కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని తెలిపారు. ఢిల్లీలో రాజకీయం కన్నా బ్యూరోక్రసీ ఎక్కువగా నియంత్రిస్తుందనీ, దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోరుకోవడంలో ప్రజల లక్ష్యం ఒకటైతే, కేసీఆర్‌ లక్ష్యం మరొకటి పెట్టుకున్నారనీ, అందుకే ఆయన పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. టీజేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌ రావు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాదన చర్యల నుంచి రాష్ట్రంలో లౌకికవిలువల పరిరక్షణకు తమ పార్టీ పాటుపడుతుందని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ కన్నెగంటి రవి మాట్లాడుతూ విభజన హామీల అమలు కన్నా కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతామని పలువురు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, టీజేఎస్‌ రాష్ట్ర నేతలు అంబటి శ్రీనివాస్‌, బైరి రమేష్‌, ధర్మార్జున్‌, బద్రొద్దిన్‌,పల్లె వినరు కుమార్‌, ఆశప్ప, నిజ్జన రమేష్‌ ముదిరాజ్‌, నాయకులు సలీంపాషా, అరుణ్‌ కుమార్‌, పాల్గొన్నారు.