ప్రశ్నించేతత్వాన్ని అణచడానికే విద్యావ్యవస్థ ధ్వంసం

– కార్మికోద్యమాల్లో ప్రభుత్వ విద్య, వైద్యం డిమాండ్లు ఉండాలి
– ఎడ్యుకేషన్‌ కమిషన్‌ కోసం పట్టుబట్టాలి
– నైపుణ్యాలు మాత్రమే కాదు ప్రాపంచిక జ్ఞానమూ అవసరం : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యను ఒకటిగా మార్చాలి
– ప్రభుత్వ విద్య అనే అంశం ప్రజా ఉద్యమంగా మారాలి : ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
– అందరికీ నాణ్యమైన విద్య అందించాలి : చావా రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమను ప్రశ్నించే సమాజం ఉండొద్దనీ, ప్రశ్నించే మనుషులు ఉండకూడదనే లక్ష్యంతోనే పాలకులు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యారంగం ఒక మాఫియాగా మారిందని ఆరోపించారు. విద్య, వైద్యం ప్రజా సంక్షేమం అనే భావన నుంచి పాలకులు వైదొలిగారని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ విద్య, వైద్యం అందించడం హక్కు అనే డిమాండ్‌ను కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు ఉద్యమాల్లో భాగం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కేసీఆర్‌ పాలనలో మన విద్యావ్యవస్థ 30 ఏండ్లు వెనక్కి పోయిందనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వమూ విద్యపట్ల అదే ధోరణితో ముందుకెళ్తే తెలంగాణలోని ఒక జనరేషన్‌ మొత్తం నష్టపోతుందని హెచ్చరించారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కర్నాటక, తమిళనాడు తరహాలో ఎడ్యుకేషన్‌ కమిషన్‌ వేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాష్ట్రంలో విద్యారంగ స్థితి-ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఎస్వీకే మేనేజింగ్‌ ట్రస్టు కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు విద్యారంగం మీద నిధులు వెచ్చించడాన్ని ఖర్చుగా చూడొద్దనీ, పెట్టుబడిగా చూడాలని సూచించారు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపౌట్స్‌ను ప్రోత్సహించి ఒకేషనల్‌ కోర్సుల ద్వారా వృత్తినైపుణ్యాలను అందించడమంటే మనుధర్మాన్ని ప్రోత్సహించడమేనన్నారు. ఐఐటీ, ఇంజినీరింగ్‌ కోర్సులు తప్ప తమకేం అవసరం లేదనే భావన సరిగాదనీ, ఒక సమాజం ముందుకెళ్లాంటే నైపుణ్యాలు మాత్రమే కాకుండా ప్రాపంచిక జ్ఞానమూ అవసరమని నొక్కి చెప్పారు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయనీ, జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు రాణించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న యూనివర్సిటీలకు నిధులిచ్చి, ఫ్యాక్టలీని నియమిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఏడు ప్రయివేటు యూనివర్సిటీలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అన్ని స్కూళ్లల్లో సెంట్రల్‌ స్టాండర్డ్‌ తేవాలనీ, హైస్కూళ్లను రెసిడెన్సియల్‌ స్కూళ్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏడో తరగతి వరకు స్థానిక భాషలోనే విద్యాబోధన ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ..ప్రైమరీ, ప్రీప్రైమరీ స్కూళ్లను విలీనం చేయాలన్నారు. ప్రీప్రైమరీ విద్య అందించకపోవడం వల్లనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయవేటు స్కూళ్లకు పంపుతున్నారని చెప్పారు. బడీడు పిల్లలను బట్టి గ్రామాల్లో స్కూళ్లను నడపాలనీ, అవసరమైతే పక్కఊర్ల బడులకు పిల్లలు వెళ్లేందుకు బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వమే కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో, జూనియర్‌, డిగ్రీల కళాశాల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతున్నదనే దాన్ని వాస్తవాలు, గణాంకాల ఆధారంగా వివరించారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపారు. వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రొఫెసర్లను నియమిస్తే చాలనీ, రాష్ట్రంలో ప్రయివేటు వర్సిటీల ఏర్పాటు అవసరం లేదని చెప్పారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో నూటికి 95 శాతం ప్రజాప్రతినిధులవే ఉన్నాయనీ, అందుకే వారు ప్రభుత్వ విద్యావ్యవస్థ ఉండొద్దని కోరుకుంటున్నారని విమర్శించారు. అమెరికా, జపాన్‌ లాంటి పెట్టుబడి దారీ దేశాల్లోనూ ఒక స్థాయి వరకు ప్రభుత్వమే విద్యను ఉచితంగా అందిస్తున్న తీరును ఉదహరణలతో వివరించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అనే అంశాలను వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు తమ పోరాటాల్లో ఎజెండాగా చేర్చుకుని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. కేరళ తరహాలో ప్రభుత్వవిద్యాసంస్థల బలోపేతానికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ గురుకుల స్కూళ్ల మాదిరిగా అభివృద్ధి చేయాలనీ, కొందరికే కాకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో విద్యకు నిధులు ఎక్కువగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలనీ, మానిటరింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఎస్వీకే ట్రస్టు సభ్యులు బుచ్చిరెడ్డి విద్యారంగంపై చర్చాగోష్టి ముఖ్యాంశాలను వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన వేదిక నాయకులు రాధేశ్యామ్‌, టీపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు టి.లక్ష్మారెడ్డి, మాణిక్‌రెడ్డి, టీఎస్‌ఎమ్‌ఎస్‌టీఎఫ్‌ నాయకులు బి.కొండయ్య, మహేశ్‌, క్రాంతికుమార్‌, రంజిత్‌కుమార్‌, బాలోత్సవ కమిటీ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, సుజావతి, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.