– విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షాసమావేశాలు విజయవంతంగా ముగిశాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధుసూదనాచారి, బడుగుల లింగయ్య యాదవ్, రావుల చంద్ర శేఖర్‌రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పనిదినాల్లో సుమారు 125 గంటల పాటు సమీక్షా సమావేశాలు జరిగాయని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సగటున 70 నుంచి 100 మంది చొప్పున పాల్గొన్నారని చెప్పారు. ప్రజలు బీఆర్‌ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదనీ, ఫలితాలు కుంగిపోయే విధంగా లేవన్నారు. కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో మాత్రమే..బీఆర్‌ఎస్ ఓడిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వారికి హుందాతనం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామ స్థాయిల్లో చేస్తున్న భౌతిక దాడులు దౌర్జన్యాలు చూస్తే.. వారి అపరిపక్వతకి అద్దంపడుతున్నాయని విమర్శించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు.