– రాహుల్ యాత్రపై బీజేపీ గుండాల దాడియత్నం
– నిరసనగా టీపీసీసీ ప్రదర్శన : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్ జోడో న్యారు యాత్రతో దేశంలో మార్పు వస్తుందనే భయంతోనే బీజేపీ గుండాలు రాహుల్ గాంధీపై దాడి చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. అస్సోంలో బీజేపీ గుండాలు అడ్డుకుని దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ బాబు జగ్జీవన్రాం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్దాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మధుయాష్కీ, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలో నెలకొన్న విపరిణామాలపై న్యాయం కోసం రాహుల్ యాత్ర చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరగడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలకు అందుబాటులో లేకుండా బీజేపీ పాలన చేస్తున్నదనీ, దేశంలో న్యాయం కరువైందని విమర్శించారు. దేశంలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనీ, అన్ని కులాలు, మతాలు ఒక్కటేననే ప్రేమతో బతకాలని రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో హింస పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో రెండు తెగల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలపై బీజేపీని రాహుల్ గాంధీ ప్రశ్నించారనీ, మోడీ వైఫల్యాలపై నిలదీశారని తెలిపారు. దానికి కొనసాగింపుగా దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యలను ఎండగట్టాలనీ, ప్రజలను జాగరూకులను చేయాలని న్యాయ యాత్ర చేపట్టారని చెప్పారు. ఈ యాత్రతో దేశంలో ప్రజల్లో ఐక్యంగా ఉండేందుకు మనో ధైర్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ వెలుగులోకి తెస్తుంటే బీజేపీ సహించలేకపోతున్నదని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇలాంటి పద్ధతులను మానుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. మాజీ మంత్రి పుష్పలీల, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పాలి -మంత్రి శ్రీధర్ బాబు
రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో విఫలమైన అస్సోం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. రాహుల్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దాడులు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులున్నారనీ, అయినా ఎప్పుడైనా దాడులు చేశామా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు.
మా దగ్గర ఉన్నప్పుడు ఒకే…కానీ ఇప్పుడే : రేణుకాచౌదరి
అస్సోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తమ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండేవాడని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి గుర్తుచేశారు. బీజేపీలోకి వెళ్లాక దారుణంగా తయారయ్యారనీ, అస్సోం ప్రజలు హిమంత్ను ఛీ కొడుతున్నారని తెలిపారు.