వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలి

– ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి పని కల్పించాలి.
– ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రకటించాలి
– ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి
– ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య
నవతెలంగాణ – భువనగిరి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యధాద్రి భువనగిరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు భువనగిరి పట్టణంలోని సుందరయ్య దుంపల మల్లారెడ్డి భవన్ లో జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలని  డిమాండ్ చేశారు.గత పది సంవత్సరాలనుండి వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులును తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయడం లేదన్నారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్న సౌకర్యాలు వికలాంగులకు ఎందుకు కలిపించడం లేదని ప్రశ్నించారు.2016  ఆర్పిడబ్ల్యుడి చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖల అధికారులు, వికలాంగుల సంఘాలతో కో ఆర్డినేషన్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు .ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్న వాటిని ఎందుకు అమలు చేయడం లేదన్నారు.వెంటనే వికలాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం గుర్తించిన 21రకాల వైకాల్యలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, షాపింగ్ కంప్లెక్స్లలో ర్యాంపులు నిర్మించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కారం చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.సదరం క్యాంపు దగ్గర కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మునిసిపల్, జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న షాపింగ్ కంప్లెక్స్ లలో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్స్ అమలు చేయడంలేదని ప్రశ్నించారు.  జిల్లాలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తూ చేసిన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే రుణలలో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ కె లలిత, జిల్లా ఉపాధ్యక్షులు పాక వెంకటేశం, జిల్లా నాయకులు బర్ల పార్వతి, నాగు నరసింహ, మామిడి కృష్ణ, గడ్డం యాదగిరి, మలయాళ మధు, ఎర్రవల్లి నాగరాజు పాల్గొన్నారు.