సెమీస్‌లో జకోవిచ్‌

Djokovic in the semis– క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్‌పై గెలుపు
–  రూబ్లెవ్‌పై జానిక్‌ సిన్నర్‌ పైచేయి
– కొకొ గాఫ్‌, సబలెంక సైతం అడుగు
–  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)
వరల్డ్‌ నం.1, సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేట తుది అంకానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో అలవోక విజయాలతో సెమీఫైనల్స్‌కు చేరుకున్న జకోవిచ్‌.. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఏకంగా 48వ సారి ఈ ఘనత సాధించాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక, కొకొ గాఫ్‌ సైతం సెమీఫైనల్లో ప్రవేశించారు.
గ్రాండ్‌స్లామ్‌ ఓపెన్‌ శకంలో దిగ్గజం మార్గరెట్‌ కోర్టు 24 టైటిళ్ల రికార్డును అధిగ మించేందుకు నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) రంగం సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్‌ అలవోక విజయం నమోదు చేశాడు. 7-6(7-3), 4-6, 6-2, 6-3తో 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరుకోవటం జకోవిచ్‌కు ఇది 48వ సారి కావటం విశేషం. మరో క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌ ఆండ్రీ రూబ్లెవ్‌పై జానిక్‌ సిన్నర్‌ 6-4, 7-6(7-5), 6-3తో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌ సర్క్యూట్‌లో అరినా సబలెంక, కొకొ గాఫ్‌లు సెమీఫైనల్లో సమరానికి సై అంటున్నారు.
ఎదురులేదు
టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌కు క్వార్టర్స్‌లో ప్రతిఘటన ఎదురు కాలేదు. 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ ఓ సెట్‌లో గెలు పొంది ఊరట చెందాడు. 3 గంటల 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో జకోవిచ్‌ 20 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరిశాడు. పాయింట్ల పరంగా 148-121తో అదరగొట్టాడు. జకోవిచ్‌కు సర్వ్‌ను అంత సులువుగా కోల్పోని టేలర్‌ ఫ్రిట్జ్‌ విమర్శల మెప్పు పొందాడు. విన్నర్లు కొట్టడంలో జకోవిచ్‌పై టేలర్‌ పైచేయి సాధించాడు. జకోవిచ్‌ 52 విన్నర్లు సాధించగా, టేలర్‌ ఫ్రిట్జ్‌ 63 విన్నర్లతో రాణించాడు. జకోవిచ్‌ 26 అనవసర తప్పిదాలు చేయగా.. టేలర్‌ 39 అనవసర తప్పిదాలు చేశాడు. మెన్స్‌ సింగిల్స్‌లో మరో క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) వరుస సెట్లలో ఆండ్రీ రూబ్లెవ్‌ (రష్యా)పై గెలుపొందాడు. 2 గంటల 39 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో రష్యా ఆటగాడు రూబ్లెవ్‌ నిరాశపరిచాడు. 4-6, 6-7(5-7), 3-6తో ఒక్క సెట్‌నూ సొంతం చేసుకోలేదు. సిన్నర్‌, రూబ్లెవ్‌ చెరో 34 విన్నర్లు, 10 ఏస్‌లు సంధించినా.. బ్రేక్‌ పాయింట్లలో ఇటలీ ఆటగాడు పైచేయి సాధించాడు. సిన్నర్‌ రెండు సార్లు రూబ్లెవ్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేయగా.. రష్యా స్టార్‌ ఒక్కసారీ ఆ పని చేయలేదు. పాయింట్ల పరంగా 115-103తో సిన్నర్‌ మెరిశాడు. ఓవరాల్‌గా సిన్నర్‌ 19 గేములు నెగ్గగా, రూబ్లెవ్‌ 13 గేములతో సరిపెట్టుకున్నాడు. రెండో సెట్‌ టైబ్రేకర్‌కు దారితీయగా.. అక్కడా రూబ్లెవ్‌ ఒత్తిడిలో చిత్త య్యాడు. మెన్స్‌ సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌తో జానిక్‌ సిన్నర్‌ తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అరినా సబలెంక (బెలారస్‌) సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్‌ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి బార్బర క్రజికోవపై బెలారస్‌ భామ వరుస సెట్లలో గెలుపొందింది. 6-2, 6-2తో సబలెంక అలవోక విజయం సాధించింది. నాలుగు ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లతో సబలెంక సూపర్‌ ప్రదర్శన చేసింది. పాయింట్ల పరంగా 55-34తో ఆధిపత్యం చూపించింది. నాల్గో సీడ్‌ అమెరికా స్టార్‌ కొకొ గాఫ్‌కు క్వార్టర్‌ఫైనల్లో కాస్త పోటీ ఎదురైంది. టైబ్రేకర్‌కు దారితీసిన మ్యాచ్‌లో గాఫ్‌ పైచేయి సాధించింది. 7-6(8-6), 6-7(3-7), 6-2తో ఉక్రెయిన్‌ అమ్మాయి మార్టాను మట్టికరిపించింది. గాఫ్‌ 9 బ్రేక్‌ పాయింట్లు సాధించగా, ఏడు బ్రేక్‌ పాయింట్లతో మార్టా ప్రతిఘటించింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో గాఫ్‌ గెల్చుకోగా.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో మార్టా సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో గాఫ్‌ దూకుడు పెంచింది. అలవోకగా 6-2తో సెట్‌తో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో కొకొ గాఫ్‌తో సబలెంక పోటీపడనుంది. ఇదిలా ఉండగా, పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న నేడు బరిలోకి దిగనున్నాడు. ఆసీస్‌ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆరో సీడ్‌ అర్జెంటీనా జోడీని ఢకొీట్టనున్నాడు.