సామాజిక న్యాయం సాధించేందుకు వీలుగా బడ్జెట్‌ ఉండాలి

– జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజల అర్థిక అభివృద్ధి పెంపొందించి, సామాజిక న్యాయం సాధించేందుకు వీలుగా బడ్జెట్‌ ఉండాలని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ కోసం సన్నాహక సమావేశం జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024-25 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల అయ్యే నిధులతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికల తయారీ కోసం మార్గదర్శకాలను సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓలు, పర్యవేక్షకులకు వివరించారు. ఈ నిధులద్వారా నిర్దేశిత నిధులుగా 60 శాతం గాను, అనిర్దేశిత నిదులుగా 40 శాతం గాను రెండు రకాలుగా విడుదల చేయబడతాయని చెప్పారు. నిర్దేశిత నిధుల్లో 30 శాతం శానిటేషన్‌ వర్క్స్‌ కొరకు, 30 శాతం తాగునీటి అవసరాల వర్క్స్‌ కోసం వినియోగించాలన్నారు. అనిర్దేశిత నిధుల్లో 30 శాతం సివిల్‌ వర్క్స్‌, 10 శాతం ఆఫీస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ చార్జెస్‌ కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ మెరుగు విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగలక్మి, డిస్ట్రిక్ట్‌ పంచాయతీ రాజ్‌ ఇఇ ఎస్‌.శ్రీనివాస రావు, భద్రాచలం పంచాయతీరాజ్‌ ఇ.ఇ డివిజన్‌ మంగ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.